కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ కోడ్ ను టీఎస్ నుంచి టీజీగా మార్పు చేస్తామని రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు మార్చే ఉద్యమాన్ని కూడా చేపట్టారు. తెలంగాణ వాదులంతా ఏపీని తీసేసి TG అని పెట్టుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఉద్యమకారులు అదే చేశారు. అయితే తీరా తెలంగాణ ఏర్పడిన తరవాత TG అనే కోడ్ ను కాకుండా.. TS అంటే తెలంగాణ స్టేట్ అనే కోడ్ ను ఎంచుకున్నారు. అప్పట్లో ఎవరూ ప్రశ్నించలేదు. ప్రశ్నించే అంత ధైర్యం ఎవరికీ లేకపోయింది. అందుకే టీఎస్ పేరుతో వాహనాలు రిజిస్టర్ అవుతున్నాయి.
టీఆర్ఎస్ బలం తెలంగాణ సెంటిమెంట్. ఆ బలంతోనే రెండు సార్లు అధికారంలోకి వచ్చారు. తెలంగాణ సెంటిమెంట్‌ను వదిలేసి పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చారు కేసీఆర్. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీగా ఆ సెంటిమెంట్ ను వర్కవుట్ చేసుకోవడంలో రెండు సార్లు విఫలమైన కాంగ్రెస్ ఈ సారి మాత్రం చాన్స్ మిస్ చేసుకోలేదు. కేసీఆర్ చేసిన అన్యాయం.. తెలంగాణ భావోద్వేగం పెరిగేలా రేవంత్ రెడ్డి కొత్త ఎన్నికల ప్రచారంలో పలు కీలక హామీలు ఇచ్చారు.
తాము అధికారంలోకి రాగానే ‘జయజయహే తెలంగాణ’ పాటను రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటిస్తామని . ..టీఆర్ఎస్ ను పోలి ఉన్నట్టుగా వాహనాల రిజిస్ట్రేషన్ కోసం టీఎస్ అని తీసుకొచ్చారని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దాన్ని సవరించి టీజీ చేస్తామని కూడా ప్రకటించారు. రేవంత్ ప్రతిపాదనలపై తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న వారిలో సానుకూలత వ్యక్తమయింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ హామీ మేరకు.. తెలంగాణ కోడ్ TS పేరును TGగా మార్చేందుకు రేవంత్ సిద్ధమయ్యారు. ఆదివారం కేబినెట్లోనే అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.