విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుపై ఇప్పటికీ స్పష్టత లేదు. భూమి ఇస్తే జోన్ పనులు ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. వెంటనే ఏపీ ప్రభుత్వం తరపున కలెక్టర్ స్థలం రెడీగా ఉందని ఇస్తామన్నా రైల్వే అధికారులు రావడం లేదని చెప్పారు. దీంతో గందరగోళం ఏర్పడింది. ఒకరిపై ఒకరు చెప్పుకోవడమే కానీ ఎందుకు.. చర్చించుకుని ఉత్తరాంధ్ర ప్రజల స్వప్నాన్ని సాకారం చేయడం లేదన్న ప్రశ్న వస్తోంది.
అసలు రైల్వే జోన్ కు ఉన్న స్థలం సరిపోతుందని డీపీఆర్ లో చెప్పుకున్నారు. కానీ స్థలం పేరుతో కేంద్రం అబద్దాలాడుతోంది. దానిపై నిలదీయలేని చేతకానితనంతో సీఎం జగన్ రెడ్డి కిందామీదా పడుతున్నారు. ఫలితంగా చేతిలోకి వచ్చిన రైల్వే జోన్ అందకుండా పోతోంది. రైల్వే వైర్లెస్ కాలనీలో ప్రత్యామ్నాయ స్థలం 30 ఎకరాలకుపైనే ఉందని, దీనికి డిపిఆర్లో కూడా ఆమోదం లభించింది. గతంలో విశాఖకు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినప్పుడు రైల్వే జోన్ పనుల ప్రారంభానికి చిహ్నంగా శిలాఫలకం సిద్ధం చేసి, ఆ క్రెడిట్ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందన్న బిజెపి నేతల అభ్యంతరాలతో ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు.
రైల్వేజోన్ ఏర్పాటుకు భూమే సమస్య అయితే.. పరిష్కరించడం ఏపీ సర్కార్ కు పెద్ద సమస్య కాదు. ఎందుకంటే విశాఖలో వేల ఎకరాల భూలావాదేవీలను ఇట్టే ప్రభుత్వం చేస్తోంది. ఉన్న భూమిలో వివాదాలు పరిష్కారం చేసి రాష్ట్రం ఇస్తే సరిపోతుంది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఇస్తున్నట్లు ప్రకటించి ఉన్న వాల్తేరు రైల్వే డివిజన్ను ఎత్తేసింది. 200 కిలోమీటర్లలోపు విజయవాడ డివిజన్ ఉండగా, వాల్తేరు రైల్వే ఎందుకని తీసేశారు. విజయవాడ డివిజన్లో వాల్తేరు డివిజన్లోని సగభాగాన్ని కలిపారు. ఇది కూడా వివాదాస్పమయింది.
మొత్తంగా రైల్వేజోన్ ఏర్పాటు చేయాలన్న చిత్తుశుద్ధి కేంద్రానికి.. చేసిన ప్రకటన ప్రకారం ఏర్పాటు చేయించుకోవాలన్న పట్టుదల రాష్ట్రానికి లేకపోవడంతో ఉత్తరాంధ్ర నష్టపోతోంది. యవత ఉద్యోగావకాశాలను కోల్పోతున్నారు.