‘సినిమా వాళ్ళని తక్కువగా చూడకండి. ఎదో ఒకనాడు దేశ భవిష్యత్ ని మార్చే శక్తి సినిమా వాళ్ళకే వుంది’ రెండుసార్లు అమెరికా అద్యక్షుడిగా పని చేసిన ప్రఖ్యాత నటుడు రోనాల్డ్ రీగన్ చెప్పిన మాటలివి. నిజంగా సినిమాకి వున్న పవర్ ఇది. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత ఎంతటి శక్తివంతమైన రాజకీయ శక్తులు ఎదిగారో ప్రత్యేక్షంగా కనిపిస్తుంది. అశేష ప్రజాదరణ వున్న సినీ తారలు అంటే పాలకులు కూడా గౌరవ భావంతోనే మెలుగుతారు. వ్యక్తిగతంగా ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ కళాకారుల విషయంలో ఏ ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించదు. ఇది కళకి ఇచ్చే మాన్యత.
అయితే ఆంధ్రప్రదేశ్ లో సిఎం జగన్ ప్రభుత్వం, సినిమా వారి పట్ల ప్రవర్తించిన తీరు ఎవరూ మర్చిపోలేరు. టికెట్ల రేట్ల నుంచి మొదలుపెడితే ప్రతి విషయంలో ఒక ఆట ఆడుకున్నారు. పాపం.. వున్న మాట చెప్పిన నాని లాంటి హీరోని సోషల్ మీడియా సైన్యంతో దారుణంగా ట్రోల్ చేయించారు. పరిశ్రమని భయపెడుతూ ఎక్కడ లేని జీవోలు తీసుకొచ్చారు. అక్కడితో అయిపోలేదు. సినీ పెద్దలని కాళ్ళ బేరానికి రప్పించుకున్నారు. నాలుగు జనరేషన్స్ ని వెండితెర ఇలవేల్పుగా అలరిస్తున్న మెగాస్టార్ చిరంజీవితో చేతులు జోడించి మొక్కించుకొని వీడియో రిలీజ్ చేసి మరీ ఆనందం పొందారు.
చిరంజీవి అలా అభ్యర్ధించడం, జగన్ ముసిముసి నవ్వులు నవ్వడం..నిజానికి చాలా మంది వైసీపీ వీర ఫ్యాన్స్ కి కూడా నచ్చలేదు. బయటికి చెప్పకుండా ఈ విషయంలో బాధపడ్డ వారు చాలా మంది వున్నారు. చిరంజీవి అంతటి వారితో అలా మొక్కించుకోవడం జగన్ కి కీడు తప్పితే మేలు చేయదు, జగన్ సుపీరియారిటీ కాంప్లెక్స్ తో చిక్కులు తెచ్చుకున్నారని వైసీపీ వర్గాలు లోలోపల చాలా మధన పడ్డాయి.
వైసీపీ వర్గాలు ఆనుకున్నదే ఇప్పుడు నిజమైయింది. నవ్విన నాప చేను పండినట్లు తన స్వయంకృషితో ఎన్నో ఒడిదుడుగులు ఎదుర్కుకొని నిలబడ్డ ‘ చిరంజీవి.. నేడు దేశంలో రెండువ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ గ్రహీత అయ్యారు. ఆయన ఖ్యాతి దశదిశలా మరోసారి గొప్పగా వ్యాపించింది. అంతటి సత్కారం అందుకున్న ఆయన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొని చిరంజీవిని సన్మానించారు. కానీ జగన్ ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు. పద్మ విభూషణ్ అనేది మామూలు అవార్డ్ కాదు. అది ఒక వ్యక్తి వస్తే ఆ వ్యక్తి పుట్టిన రాష్ట్రం అధికారికంగా జరుపుకునే ఒక పండగ. లాంటిది జగన్ మోహన్ రెడ్డి కనీసం తన ట్విట్టర్ లో కూడా స్పందన తెలియజేయలేదు.
చిరంజీవి రాజకీయాల్లో విఫలమైఉండొచ్చు గాక, కానీ ఆయన్ని అభిమానించే కోట్లాది మంది వున్నారు. కోట్ల మంది అభిమానులకు ప్రాతినిధ్యం వహించే ఓ అగ్రకథానాయకుడాయన. అన్నిటికి మించి ఒక కళాకారుడు. అలాంటి కళాకారుడి పట్ల జగన్ మోహన్ రెడ్డికి వున్న ఈగో ఏమిటో వైసీపీ ఫ్యాన్స్ కి కూడా అర్ధం కావడం లేదు. తెలంగాణ ప్రభుత్వం చిరంజీవిని ఘనంగా సత్కరించిన ఈ సందర్భంలో మరోసారి.. జగన్ అహంకారం తెరపైకి వస్తోంది. పద్మ విభూషణ్ అందుకున్న ఓ కళాకారుడికి తెలంగాణ ముఖ్యమంత్రి చేతులు జోడించి తన మాన్యతని ప్రదర్శించారు. ఇది సిఎం రేవంత్ రెడ్డిలో సంస్కారానికి అద్దం పట్టింది.
ఇక్కడే జగన్ లోని అహంకారం పై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. చిరంజీవి, జగన్ కు నమస్కారం పెడుతున్న ఫోటోలో జగన్ ముసిముసి నవ్వులు నవ్వుతున్న విజువల్ ని జత చేసి ‘సంస్కారం….అధికారాన్ని బట్టి రాదు.. పుట్టుకతో రావాలి’ అనే పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ పోస్టులకు ఎలా బదులు చెప్పాలో వైసీపీ శ్రేణులకు కూడా అర్ధం కావడం లేదు. అయితే ఇప్పటికైనా మించిపోయిన లేదు.. జగన్ ముందు మంచి అవకాశం వుంది. పద్మ విభూషణ్ అందుకున్న చిరంజీవి పట్ల తెలంగాణ ప్రభుత్వం చూపించిన మాన్యత కనపరిస్తే జగన్ కే మంచిది. లేదంటే.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.