టెక్నాలజీ మరీ ముదిరిపోయింది. ఇప్పుడున్న సాంకేతికతతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. అసాధ్యం అన్నదే లేదు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ వచ్చాక ఊహలకు మరిన్ని రెక్కలు వచ్చాయి. వాటి ఆసరాతోనే రెహమాన్ ఓ సరికొత్త ప్రయోగం చేశారు. ఏఐ ఉపయోగించి, చనిపోయిన వాళ్ల గొంతులతో పాట పాడించారు. ‘లాల్ సలామ్’ కోసం ఈ సరికొత్త చరిత్ర లిఖించారు రెహమాన్.
రెహమాన్ సంగీత సారధ్యంలో ఎన్నో పాటలు పాడిన గాయకులు బంబా బక్యా, షాహుల్ హమీద్. చిన్న వయసులోనే వీరిద్దరూ చనిపోయారు. అయితే వీళ్ల పాటలంటే ఇష్టపడే రెహమాన్, వాళ్ల గొంతుల్ని మళ్లీ రీ క్రియేట్ చేయించారు. ఏఐ టెక్నాలజీతో ఓ పాట పాడించారు. వాటికి సంబంధించిన చట్టపరమైన అనుమతులు అన్నీ తీసుకొన్నారు. బంబా బక్యా, షాహుల్ హమీద్ ల కుటుంబ సభ్యులతో మాట్లాడి, వాళ్ల పారితోషికాలు సైతం చెల్లించారు. ఓరకంగా సంగీత ప్రపంచంలో ఇది సరికొత్త అధ్యాయం. ఈ ప్రయోగం సక్సెస్ అయితే మమ్మద్ రఫీ నుంచి ఘంటసాల వరకూ ఎవరితోనైనా ఇప్పుడు కొత్త పాట పాడించొచ్చు. ఎస్.పీ బాలసుబ్రహ్మణ్యంతో ఓ పాట పాడించాలని ఉందని రెహమాన్ ఈ సందర్భంగా చెప్పడం మరింత ఆసక్తిని కలిగిస్తోంది. లెజెండరీ గాయనీ గాయకులు మళ్లీ వాళ్ల కొత్త పాటలతో సంగీత ప్రపంచాన్ని అలరించే రోజు ఎంతో దూరంలో లేదు.
కాకపోతే.. కొత్త గాయకులు ఇది తలనొప్పి వ్యవహారమే. అందరూ ఏఐ ఉపయోగించుకొని, ఆ తరం గాయకులతో పాటలు పాడించుకొంటే, మరి ఈతరం వాళ్ల మాటేంటి? అనేది పెద్ద ప్రశ్న. ఈ ప్రయోగం ఇక్కడితో ఆగిపోదు. చనిపోయిన ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి దిగ్గజాలను ఏఐ రూపంలో మళ్లీ సృష్టించి, ప్రాణ ప్రతిష్ట చేసి, వెండి తెరపైకీ తీసుకురాగలరు. ఆ రోజులు ఎంతో దూరంలో లేవు.