బీఆర్ఎస్ క్యాడర్ ను గుప్పిట పట్టడానికి కాంగ్రెస్ వేసిన ట్రాప్ లో సులువుగా పడిపోయారు ఆ పార్టీ క్యాడర్. తామేదో ఆవేశ పడ్డామని .. గట్టి కౌంటర్ ఇచ్చామని అనుకుంటున్నారు.. కానీ కేసుల ఊబిలోకి దిగిపోతున్నామని గుర్తించలేకపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ ను ఆయన భాషలోనే తిట్టారు. కేసీఆర్ ను తిడతారా అని బాల్క సుమన్ దగ్గర నుంచి బీఆర్ఎస్ క్యాడర్ లో అనేక మంది నేతలు.. అలాగే సోషల్ మీడియాలో బీఆర్ఎస్ సపోర్ట్ హ్యాండిల్స్ అన్నీ రేవంత్ పై బూతు ప్రయోగం చేశాయి.
ప్రభుత్వాధినేతను అలా అంటే.. ఇక పోలీసులు ఊరుకుంటారా ? . ఖచ్చితంగా ఇలాంటి ఎఫెక్ట్ కోసమే చూస్తున్న కాంగ్రెస్ పెద్దలు… రంగంలోకి దిగిపోయారు. బీఆర్ఎస్ తరపున యాక్టివ్ గా ఉండే.. సోషల్ మీడియా ఖాతాలు.. బూతులు ప్రయోగించిన బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టడం ప్రారంభించారు. బాల్క సుమన్ గా వెంటనే కేసులు నమోదయ్యాయి. ముఖ్యమంత్రిపై అసభ్య పదజాలం ప్రయోగించిన సోషల్ మీడియా ఖాతాలను గుర్తించారు. వాటిపై కేసులు పెట్టబోతున్నారు.
కేసీఆర్ ను అన్నారని ఆవేశపడిన వారంతా ఇప్పుడు కలుగుల్లోకి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్యమంత్రిని రివర్స్ లో తిట్టడం తమ అధినేతకు గౌరవం ఇవ్వడం అనుకున్నారేమో కానీ.. బీఆర్ఎస్ బలంపై దెబ్బకొట్టాడనికి కాంగ్రెస్ వేసిన ట్రాప్ లో మాత్రం సరిగ్గా చిక్కుకుపోయారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేసిన ఫేక్ ప్రచారాలకే బీఆర్ఎస్ సోషల్ మీడియా వణికిపోయింది. ఇప్పుడు… ఇక తట్టుకుంటారా అన్నదే సమస్య. మొత్తంగా రేవంత్ రెడ్డి ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా రాజకీయం చేస్తున్నారని అర్థమవుతోంది.