తెలంగాణలో కొత్త అసెంబ్లీ ఏర్పడి రెండు నెలలు కావొస్తోంది. బీజేపీ ఇంతవరకు ఫ్లోర్ లీడర్ ఎవరన్నది ప్రకటించలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి నలుగురు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలున్నారు. హైదరాబాద్ పరిధిలోని గోషామహల్ నుంచి రాజాసింగ్ విజయం సాధించారు. వీరిలో నిర్మల్ నుంచి గెలిచిన మహేశ్వర్ రెడ్డి, గోషామహల్ నుంచి విజయం సాధించిన రాజాసింగ్ గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన అనుభవం ఉంది.
గత అసెంబ్లీ సెషన్ లో నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బీజేపీ తరఫున ఎక్కువ సేపు మాట్లాడారు. దీంతో ఆయనకు బీజేఎల్పీ లీడర్ పదవిని కట్టబెడతారని ప్రచారం జరిగింది. కానీ బీసీ అంశం కొత్తగా తెరపైకి వచ్చింది. గెలిచిన ఎమ్మెల్యేల్లో ఇద్దరు మాత్రమే బీసీలు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీసీ సామాజికవర్గానికి చెందిన వారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని సూర్యాపేటలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఇప్పుడు శాసనసభాపక్ష నేతను కూడా చేయకపోతే దానికి విలువ ఉండదనుకుంటున్నారు.
ఈ నెల 8 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ తరుణంలో పార్టీ తరఫున గళం వినిపించేందుకు ఫ్లోర్ లీడర్ అవసరం. అన్ని పార్టీలు ఫ్లోర్ లీడర్లను ప్రకటించినా.. బీజేపీ మాత్రం ఎవరో చెప్పలేదు. రాజకీయ అనుభవం ఉన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఇస్తే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి సామాజిక వర్గానికే కట్టబెట్టినట్లవుతుందనే చర్చ ఉంది. రాజాసింగ్ కు పార్టీలో మద్దతు లేదు. కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ లపై గెలిచిన కాటిపల్లి రమణారెడ్డికి ఇవ్వాలన్న చర్చ కూడా నడుస్తోంది. ఈ ఎనిమిది మందిలోనే నేతను తేల్చలేక బీజేపీ హైకమాండ్ కూడా పక్కన పెట్టింది