పవన్ కల్యాణ్ పార్టీకి విరాళాలు ఇచ్చేందుకు ఇప్పుడు చాలా మంది వస్తున్నారు. ముక్కూ ముఖం తెలియని వ్యాపారేత్తలు.. కాస్తో కూస్తో రాజకీయంలో ఉన్నారు.. పెద్ద పారిశ్రామిక వేత్తలు కూడా జనసేన పార్టీ ఆఫీసుకు వచ్చి విరాళాల చెక్కులు ఇస్తున్నారు. తర్వాత పవన్ ను కలిసి.. మనసులో మాట చెబుతున్నారు. ఫలానా సీటు నుంచి పోటీ చేస్తామని చెబుతున్నారు. వీరి తీరుతో పవన్ కల్యాణ్ కు చిరాకొస్తోంది. సీట్ల కోసం విరాళాలు ఇచ్చే పని అయితే అవసరం లేదని నేరుగా చెప్పేస్తున్నారు. ఇలా ఏడుగురు ఇచ్చిన చెక్కుల్ని వెనక్కి పంపేసినట్లుగా జనసేన వర్గాలు చెబుతున్నాయి.
జనసేన పార్టీ అధినేత ఇప్పటికే టీడీపీతో సీట్ల అంశాలను ఫైనల్ చేసుకున్నారు. అభ్యర్థులను కూడా దాదాపుగా ఖరారు చేసుకున్నారు. టీడీపీతో పొత్తు అవకాశాలు ఉండటంతో వంద శాతం గెలుపు ఖాయమనుకున్న నియోజకవర్గాలే తీసుకుంటున్నారు. అందుకే విరాళాలిస్తే సీట్లు ఇచ్చేస్తాని కొంత మంది వెంట పడుతున్నారు గతంలో జనసేన ఒంటరిగా పోటీ చేసినప్పుడు పది లక్షల విరాళం ఇచ్చేందుకు కాదు కదా అసలు కలిసేందుకు ఆసక్తి చూపని వారు ఇప్పుడు పెద్ద ఎత్తున వస్తూండటానికి కారణం సీటు ఆశేనని అంటున్నారు. ఇలా విరాళాల ఆశ చూపడం ద్వారా పవన్ పై ఒత్తిడి పెంచే వ్యూహాన్ని కూడా.. కొంత మంది వైసీపీ సానుభూతి పరులు అమలు చేస్తున్నారన్న అనుమానాలు కూడా ఉన్నాయి.
ఈ విషయంలో పవన్ కల్యాణ్ నిక్కచ్చిగా వ్యవహరించాలని అనుకుంటున్నారు. అందుకే వచ్చిన చెక్కుల్లో నిజాయితీగా పార్టీకి విరాళం ఇచ్చిన వారివే ఉంచుకున్నారు. వారు పార్టీ టిక్కెట్టో.. మరో రకమైన ప్రయోజనమో ఆశించే వారయితే.. అక్కర్లేదని వెనక్కిచ్చేస్తున్నట్లుగా చెబుతున్నారు.