తమిళ హీరో శివ కార్తికేయన్‌కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. తన ‘వరుణ్ డాక్టర్’ తెలుగులో మంచి వసూళ్లని రాబట్టింది. ‘ప్రిన్స్’ స్ట్రయిట్ తెలుగు సినిమా స్థాయిలో విడుదలైంది. శివ కార్తికేయన్ సినిమా వస్తోందంటే ఇక్కడ అటెన్షన్ చూపిస్తారు. అలాంటిది తన తాజా చిత్రం ‘అయలాన్’ తెలుగు రిలీజ్‌కు నోచుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. శివ కార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా తమిళంలో విడుదలైంది. ఆ సమయంలో డబ్బింగ్ సినిమాలు విడుదల చేసేందుకు తెలుగు నిర్మాతలు అంగీకరించలేదు. దాంతో జనవరి 26న విడుదలకు ముస్తాబైంది. తెలుగులో ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా నిర్వహించారు. మీడియాకు శివ కార్తికేయన్ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. కానీ జనవరి 26న ఆర్థికపరమైన సమస్యలతో ఆగిపోయింది. థియేటర్ల దగ్గర టికెట్లు అమ్మి, డబ్బులు వాపస్ ఇచ్చేశారు.
ఇప్పుడు ఈ సినిమా మొత్తంగా తెలుగు రిలీజ్‌కు దూరమైంది. ఈనెల 9న నేరుగా ఓటీటీలో విడుదల అవుతోంది. సన్ నెట్ వర్క్ లో.. ఈ సినిమా చూడొచ్చు. తమిళంలో ఈ సినిమాకు అంతంత మాత్రంగానే ఆదరణ దక్కింది. తెలుగులో ఆలస్యంగా రిలీజ్ చేయడం, టాక్ తెలుసిపోవడంతో బజ్ తగ్గిపోయింది. విడుదల చేద్దామని బరిలోకి దిగినా, ఆర్థిక సమస్యలు వెంటాడాయి. దాంతో.. తెలుగులో ఈ సినిమా రిలీజ్ చేయకుండానే ఓటీటీలోకి దింపేస్తున్నారు.