#90s వెబ్ సీరిస్తో మంచి పేరు తెచ్చుకున్న మౌళి అనే యువనటుడిపై వైసీపీ బూతు మాఫియా తమ గురి ఎక్కు పెట్టింది. ఆయన చేసిన పాపం.. రాజధానిని మాయం చేయడం. స్టేజ్ ఎక్కితే నలుగుర్ని నవ్వించడంలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మౌళి .. ఇటీవల ఓ కార్యక్రమంలో రాజధానిని మాయం చేశానని జోక్ వేశాడు. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. వెంటనే.. వైసీపీ బూతు మాఫియా .. తమ బూతుల ఆయుధాలతో రంగంలోకి దిగిపోయింది.
మౌళినే కాదు ఆయన అమ్మా, నాన్నలను కూడా ఇష్టం వచ్చినట్లుగా తిట్టడం ప్రారంభించారు. దీంతో భయపడిపోయిన మౌళి సారీ చెబుతూ ప్రకటన విడుదల చేశారు. తన తల్లిదండ్రులను ఇందులోకి లాగవద్దని విజ్ఞప్తి చేశారు. తాను ఓ జోక్ మాత్రమే వేశానని స్పష్టం చేశారు. ప్రజల్ని నవ్వించడమే తన గోల్ అని రాజకీయాలకు సంబంధం లేదన్నారు. మౌళి చేసిన సోషల్ మీడియా ప్రకటన తో వైసీపీ బూతు మాఫియా ఎంతకైనా తెగిస్తుందని అర్థమయిందన్న విమర్శలు వస్తున్నాయి.
ఏపీ రాజధాని ఏది అనేది వైసీపీ వాళ్లు కూడా చెప్పరు.. చెప్పలేరు. ఉన్న నిజాన్ని జోకులుగా చెప్పినా… వైసీపీ వాళ్లకు కోపం వస్తుంది. అయినా వైసీపీ నేతలకు..ఎదురుదాడి అంటే బూతులే అన్నట్లుగా మారిపోయింది. ప్రతి ఒక్కర్నీ బూతులు తిట్టి.. ఏదో చేద్దామనుకుంటున్నారు. అందర్నీ మానసికంగా వేధించాలనుకుంటున్నారు. రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితి అత్యంత ఘోరమైనదని.. వైసీపీ అధినేత ఓ విష సంస్కృతిని ప్రవేశ పెట్టారన్న విమర్శలు వస్తున్నాయి.