చివరి అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యేల్లో నిస్తేజం, నీరసం కనిపించింది. ముఖ్యమంత్రి ప్రసంగించేటప్పుడు ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉంటారు. కానీ జగన్ ప్రసంగం వినడానికి ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ మంది సభకు రాలేదు. నలభై మంది లోపే సభలో ఉన్నారు. జగన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడాలనుకున్నా.. అంతకు ముందే టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేయడం స్పీకర్ సంప్రదాయంగా పెట్టుకున్నారు. అలా సస్పెండ్ చేసిన తర్వాత వైసీపీ సభ్యులయినా నిండుగా కనిపించారా అంటే అదీ లేదు.
ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్నంత సేపు వైసీపీ ఎమ్మెల్యేలు … అలా గమ్మున కూర్చుండిపోయారు. జగన్ రెడ్డి తాను సాధించిన ఘనతల్ని చెప్పుకోలేకపోయారు. హామీలు అమలు చేశామని చెప్పుకోవడానికి ప్రయత్నించినప్పుడైనా ఎమ్మెల్యేలు బల్లలు చరిచి సంతృప్తి వ్యక్తం చేస్తారనుకున్నారు. కానీ ఎవరూ అలాంటి ప్రయత్నం చేయలేదు. జగన్ రెడ్డి తన వైఫల్యాలకు కారణాలు చెబుతున్నట్లుగా ప్రసంగం సాగింది. ఎమ్మెల్యేలు కూడా అలాగే వ్యవహరించారు.
గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు విధేయతా ప్రదర్శనకు ఎక్కువ ప్రయత్నించేవారు. వైసీపీలో విథేయతా ప్రదర్శన అంటే.. టీడీపీ నేతల్ని బూతులు తిట్టడమే. సభలో జగన్ ముందు తమ ప్రతాపాన్ని మరింత ఎక్కువగా చూపించి జగన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేసి ఏదో పదవి పొందాలనుకునేవారు. ఇప్పుడా అవసరం లేదు కాబట్టి అందరూ లైట్ తీసుకున్నారు. టిక్కెట్ ఇస్తారో లేదో గ్యారంటీ లేని వాళ్లు ఎవరూ పెద్దగా సభకు రావడంలేదు. దీంతో వైసీపీలో ముందే ఓడిపోయిన ఫీలింగ్ కనిపిస్తోందన్న వాదన వినిపిస్తోంది.