ఏపీ బీజేపీ నేతలు ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు. ఉన్నంత కాలం వైసీపీకి ఊడిగం చేసి ఇప్పుడు టీడీపీతో పొత్తులో సీటు వస్తే చాలు గెలిచేస్తామని నియోజకవర్గాలపై కర్చీఫ్లు వేసేసుకుంటున్నారు. నీలి మీడియాకు లీకులు ఇస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. తమ పేరు రేసులో ఉందని చెప్పుకునేందుకు హడావుడి పడుతున్నారు. విచిత్రం లోక్ సభకు పోటీ చేస్తామని పొత్తులో తమకు టీడీపీ, జనసేన మద్దతు ఇచ్చి గెలిపించేస్తాయని ఆశ పడుతున్న వారిలో సోము వీర్రాజు మాత్రమే కాదు.. జీవీఎల్ నరసింహారావు కూడా ఉన్నారు.
వీరిద్దరూ పక్కా వైసీపీ ఫ్యాన్స్. అయినా ఏ మాత్రం సిగ్గుపడకుండా పొత్తులో సీట్లొస్తాయని ఎంపీలు అయిపోతామని అనుకుంటున్నారు. మీడియా ప్రతినిధులకు లీకులు ఇస్తున్నారు. రాజమండ్రి నుంచి సోము వీర్రాజు.. విశాఖపట్నం నుంచి జీవీఎల్ తమకు సీటు ఖరారు అయినట్లేనని అనుకుంటున్నారు. పురందేశ్వరికి ఒంగోలు.. సుజనా చౌదరికి విజయవాడ.. సత్యకుమార్ కు రాజంపేట కూడా వస్తాయని చెబుతున్నారు.ఈ జాబితాను నీలి మీడియాలో చూసి టీడీపీ నేతలు నోళ్లు నొక్కుకుంటున్నారు.
నిజంగా అన్ని సీట్లు ఇచ్చినా వాళ్లకు గెలిచే సామర్థ్యం ఉందా అన్న ప్రశ్న వస్తోంది. అసెంబ్లీ సీట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా పార్లమెంట్ సీట్లు ఇస్తారని అనుకుంటున్నారు. ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు. ఉన్నంత కాలం వైసీపీకి అనుకూలంగా వ్యవహరించి.. టీడీపీని బూతులు తిట్టి ఇప్పుడు ఆ పార్టీ మద్దతుతో ప్రజా ప్రతినిధులం అయిపోవాలని అనుకుంటున్న వారి ఆశల్ని చూసి.. సామాన్య జనం కూడా ముక్కు మీద వేలేసుకుంటున్నారు.