‘జైలర్’తో సూపర్ స్టార్ రజినీకాంత్ స్టామినా మరోసారి రుజువైయింది. రజనీ బాక్సాఫీసు మ్యాజిక్ ఏ స్థాయిలో వుంటుంది చూపించింది. ఇప్పుడు ఆయన నుంచి మరో సినిమా వస్తుంది.. అదే ‘లాల్ సలామ్’. అయితే ఇది పూర్తిగా రజనీ సినిమా కాదు. ఆయనది కీలక పాత్ర. ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా తెలుగు ట్రైలర్ ని వదిలారు. ట్రైలర్ కట్ దర్శకురాలు ఐశ్వర్య .. కథకు కట్టుబడింది. రజనీ వున్నారు కదా అని ఓపెనింగ్ షాటే ఆయన మీద వేసి హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయలేదు.
ట్రైలర్ సెకండ్ హాఫ్ లో ఎంట్రీ ఇస్తారు రజనీ. అంతకుముందు విష్ణు విశాల్, విక్రాంత్ పాత్రలు, ఊరి వాతావరణం, క్రికెట్, జాతర, కుల, మత రాజకీయంతో ముడిపడ్డ సన్నివేశాలను చూపించారు. మొయిద్దీన్ భాయ్ గా రజనీ ఎంట్రీ ఆయన మార్క్ లోనే వుంది. ‘ముంబైలో బాషా లాంటి వారు’ అనే డైలాగు బాగా క్లిక్ అయ్యింది. కుల, మత ఘర్షణ నేపధ్యంలో సున్నితమైన అంశాలతో ముడిపడిన కథ లాల్ సలాం అని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. రజనీ పాత్ర సినిమాకి ప్రధాన ఆకర్షణ. అయితే ఆయనకి సాయి కుమార్ డబ్బింగ్ అంతగా నెప్పలేదనిపించింది. మనో వాయిస్ ప్రేక్షకుల మనసుల్లో అంతలా రిజిస్టర్ అయిపొయింది. రెహ్మాన్ నేపధ్య సంగీతం బాగా కుదిరింది. ఈనెల9న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.