ఓ హిట్ ఫార్ములాను అనుసరించడం ఏమాత్రం ఆక్షేపణీయం కాదు. నిజానికి అదో సక్సెస్ ఎలిమెంట్ కూడా. అందుకే పరశురామ్ హిట్ బాటలోనే అడుగులేస్తున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా గీత గోవిందంతో ఓ సూపర్ హిట్ కొట్టాడు పరశురామ్. ఆ సినిమాతోనే తన స్టామినా తెలిసొచ్చింది. ఇప్పుడు మళ్లీ అదే హీరోతో.. ఓ సినిమా చేస్తున్నాడు. దానికి ‘ఫ్యామిలీ స్టార్’ అనే చక్కటి టైటిల్ పెట్టాడు. ఏప్రిల్ 5న ఈ సినిమా విడుదల కానుంది. ఈలోగా ఓ పాటని రిలీజ్ చేశారు.
‘నందనందన’ అంటూ సాగే ఈ గీతం… మంచి మెలోడీ. అయితే ఈ పాటని తీర్చిదిద్దిన విధానంలో ‘గీత గోవిందం’ సెంటిమెంట్ ని మక్కీకి మక్కీ ఫాలో అయ్యారనిపిస్తుంది. ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన తొలి పాట .. ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే..’ పాటని విడుదల చేశారు. సిద్ద్ శ్రీరామ్ పాడిన ఆ పాట అప్పట్లో ఓ సంచలనం. ‘గీత గోవిందం’పై ఫోకస్ పెరగడానికి కారణం ఆ పాటే. ఇప్పుడు కూడా ఈ ఆల్బమ్ నుంచి సిద్ద్ పాడిన పాటే విడుదల చేశారు. పైగా రెండింటికీ గోపీ సుందర్ సంగీతాన్ని అందించాడు. రెండు పాటల్నీ అనంత శ్రీరామ్ రచించాడు. ఇది పక్కాగా అయితే కో ఇన్సిడెన్స్ కావు. హిట్ సెంటిమెంట్ ని ఫాలో అయిపోవడమే. పాట కూడా చాలా క్లాసీగా ఉంది. తీర్చిదిద్దిన విధానం కూడా బాగుంది. ఏ సెంటిమెంట్ ఫాలో అయితే ఏంటి? మంచి పాటైతే వచ్చింది. సినిమాకి బజ్ పెరిగింది. అది చాలు కదా..?!