ఏపీకి సంబంధించి కొన్ని విచిత్రాలు జరిగిపోతూ ఉంటాయి. అవి నిజంగానే జరిగిపోతాయా.. పక్కా స్క్రీన్ ప్లేనా అన్నది మాత్రం ఎప్పటికీ సస్పెన్స్ గానే ఉంటుంది. అలాంటిదే ఒకటి జరిగిందని తాజాగా వెలుగులోకి వచ్చింది. రుషికొండ అక్రమాలపై హైకోర్టు ఆదేశాలతో కేంద్రం నియమించిన కమిటీ చైర్మన్ నివేదిక రెడీ అయిపోయి.. ఇక సంతకం చేయాలనుకున్న సమయంలో హఠాత్తుగా చనిపోయారు. ఆ విషయాన్ని కేంద్రం తరపు లాయర్లు హైకోర్టుకు తెలియచేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
విశాఖలోని రుషికొండపై చేపట్టిన నిర్మాణాలు, ఇతర పర్యావరణ ఉల్లంఘనలపై కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ పుణుల కమిటీ నియమించింది. దీనికి గౌరప్పన్ అనే ఆయన చైర్మన్ గా వ్యవహరించారు. క్షేత్రస్థాయి లో పరిశీలించి గుర్తించిన వివరాలను కమిటీ చైర్మ న్, ఇతర సభ్యులు నివేదికలో పొందుపర్చారు. నివేదికపై ఆయన సంతకం చేయకుండానే కమిటీ చైర్మన్ కె.గౌరప్పన్ గుండెపోటుతో మరణించారు. ఇదే విషయాన్ని కోర్టుకు చెప్పిన కేంద్ర లాయర్లు.. నివేదికను కోర్టు ముందుంచడంలో జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. చైర్మన్ లేవనెత్తిన అభ్యంతరాలపై కమిటీలో ఇతర సభ్యుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నామని, తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించేందుకు రెండు వారా ల సమయం ఇవ్వాలని అభ్యర్థించారు.
ఖచ్చితంగా నివేదిక సమర్పించాల్సిన సమయంలో చైర్మన్ గుండెపోటుతో చనిపోవడం.. అది కూడా రుషికొండపై నివేదిక కావడంతో… చాలా మందిలో అనేక రకమైన ఆలోచనలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. చిత్ర విచిత్రాలు జరగడం ఏపీకి సంబంధించిన అంశాల్లో కామనేనని అంటున్నారు.