ఏపీలోని కీలక నియోజకవర్గాల్లో చీరాల ఒకటి. ఈ నియోజకవర్గంలో కాపుల ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. దేవాంగ కమ్యూనిటీకి చెందిన జనాభా 19 శాతం ఉంటే.. 15 శాతం జనాభా పద్మశాలి వర్గానికి చెందిన వారు ఉన్నారు. ఇక్కడ రాజకీయంగా ఆమంచి బ్రదర్స్ వర్సెస్ కరణం బలరాం వర్గాల మధ్య వర్గపోరు నడుస్తోంది. ఆమంచి కృష్ణమోహన్‌ను పక్కనే ఉన్న పరుచూరు నియోజకవర్గంలో పోటీ చేయాలని పంపించారు జగన్. అయితే కృష్ణమోహన్ మాత్రం విముఖంగా ఉన్నారు. ఇండిపెండెంట్ గా అయినా చీరాలలోనే పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
గత ఎన్నికల్లో చివరి క్షణంలో పోటీ చేసి గెలిచిన కరణం బలరాం
2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కరణం బలరాం చీరాలలో గెలిచారు. 53 శాతం ఓట్ షేర్ సాధించారు. అదే సమయంలో వైసీపీ నుంచి పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ 42 శాతం ఓట్లు సాధించారు. ఇతరులకు 5 శాతం ఓట్లు వచ్చాయి. నిజానికి ఆమంచి టీడీపీ తరపునే పోటీ చేయాల్సింది. కానీ చివరి క్షణంలో వైసీపీలో చేరిపోయారు. దాంతో టీడీపీలో టిక్కెట్ లేదనుకున్న కరణంకు చీరాల టిక్కెట్ దొరికింది. గెలిచేశారు. వచ్చే ఎన్నికల్లో కుమారుడు కరణం వెంకటేష్ పోటీ చేయాలని డిసైడయ్యారు.
గందరగోళంగా వైసీపీ పరిస్థితి
వైసీపీ పరిస్థితి గందరగోళంగా ఉంది. కరణం వెంకటేష్ కు టిక్కెట్ కన్ఫర్మ్ కాలేదు. రకరకాల నియోజకవర్గాల పేర్లు వినిపిస్తున్నాయి. చివరికి వారిని అద్దంకికి పంపినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. వారిని అక్కడి నుంచి తప్పిస్తే… ఆమంచికి చీరాల టిక్కెట్ లభిస్తుంది. ఒక వేళ రాకపోయినా ఆమంచి తగ్గడం లేదు. తాను స్వతంత్ర అభ్యర్థిగా అయినా బరిలో ఉంటానంటున్నారు. ఆయన పోటీ చేయాలనుకుంటే.. టీడీపీ, జనసేన టిక్కెట్లు ఇవ్వడానికి రెడీగా ఉంటాయి. ఎందుకంటే చీరాలలో ఆమంచికి ఉన్న పట్టు అలాంటిది. ఇండిపెండెంట్ గా కూడా గెలిచిన రికార్డు ఉంది. ఒక వేళ కరణం వెంకటేషే చీరాల నుంచి పోటీ చేస్తే.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమంచి సహకరించరు. ఆమంచి సహకారం లేకపోతే వైసీపీకి అవకాశాలు దాదాపుగా ఉండవు. ఈ పరిస్థితుల్లో వైసీపీ ఓటు బ్యాంకు చీలడం వంటి పరిస్థితులతో వైసీపీ చీరాలలో వెనుకంజ వేసే అవకాశాలున్నట్లు కనిపిస్తోంది. టీడీపీని దెబ్బకొట్టాడనికి ఆ పార్టీలోని నేతలందర్నీ వైసీపీలో చేర్చుకుకున్నారు. కానీ అదే ఆ పార్టీకి పెద్ద మైనస్ అవుతోంది.
ఆనం, కరణం ఇద్దరూ బరిలో ఉంటే కూటమికి ప్లస్
జనసేన , టీడీపీ కూటమికి అడ్వాంటేజ్ సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గా కొండయ్య అనే నేతను చంద్రబాబు నియమించారు. చీరాలలో టీడీపీకి నాయకత్వ కొరత ఉంది. పద్మశాలీ వర్గానికి పోతుల సునీతను చంద్రబాబు చీరాలలో ప్రోత్సహించారు. కానీ ఆమె ఓ సారి ఓడిపోయినా ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా వైసీపీలో చేరిపోయారు. కరణం కూడా వైసీపీలో చేరిపోయారు. ఆమంచి కూడా టీడీపీ నుంచే వైసీపీకి వెళ్లిపోయారు. దీంతో పోటీ చేయదగ్గ నేతలంతా వైసీపీలో ఉండిపోయారు. చివరికి కొండయ్య అనే నేతను ఇంచార్జ్ గా చేశారు చంద్రబాబు. విద్యా సంస్థల అధినేత అయిన ఆయన.. నియోజకవర్గంలో చురుకుగా పని చేసుకుంటున్నారు. కానీ చివరికి ఆయనకు టిక్కెట్ ఖారారు చేస్తారా లేదా అన్నది స్పష్టత లేదు. జనసేనకు కేటాయిస్తే ఆమంచి సోదరుడు పోటీ చేసినా ఆశ్చర్యం లేదు. మొత్తంగా ఆమంచి కృష్ణమోహన్ తీసుకునే నిర్ణయం ఫలితాన్ని ప్రభావితం చేస్తుంది. కానీ ఆయన గెలుస్తారన్న గ్యారంటీ మాత్రం ఉండదు. ఎందుకంటే రాజకీయ శత్రువుల్నీ ఆయన అంతే బలంగా పెంచుకున్నారు.