వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయన వ్యాపార భాగస్వామి అనే ప్రచారం కూడా ఉంది. అయితే ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ ఆయనను జగన్ రెడ్డి గెంటేశారు. దానికి కారణంగా రేవంత్ రెడ్డి ఇచ్చిన విందుకు హాజరు కావడం అనే కారణం చూపించారు. ఇప్పుడు ఆయన జనసేనలో చేరి జగన్ రెడ్డి అవినీతి గురించి కథలు కథలుగా మీడియాతో చెబుతున్నారు.
ప్రభుత్వంలో ఏం జరిగిందో బాలశౌరికి తెలుసు. అందుకే ఆయన అవినీతి కథలను బయట పెడుతున్నారు. ఇసుక, షిరిడిసాయి ఎలక్ట్రికల్స్ గురించి ఆయన కీలక విషయాలు బయట పెట్టారు. ఇసుక వెనుక ఉన్న అతి పెద్ద స్కామ్లో పది మంది కలెక్టర్లు కూడా బలవబోతున్నారని ప్రకటించారు. ఇసుకను జగన్ రెడ్డి ఒక్కరే దోచుకుంటున్నారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. అలాగే జగన్ రెడ్డి బినామీ కంపెనీగా భావించే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఈ ఐదేళ్లలో చేసిన నిర్వాకాల గురించి చెప్పాల్సిన పని లేదు. వీటిపైనా చిన్న దర్యాప్తు చేస్తే అసలు విషయాలు బయటకు వస్తాయంటున్నారు.
బాలశౌరి లాంటి జగన్ రెడ్డి ఆత్మీయుడు.. నిజంగా ఆయనకు దూరం అయి ఉంటే మాత్రం.. సంచలన విషయాలన్నీ.. అక్కడి గుట్టు ముట్లన్నీ బయటకు రావడానికి ఎంతో సమయం పట్టదు. జగన్ రెడ్డి అక్రమాలకు సహకరించిన వారందర్నీ శంకరగిరి మాన్యాలకు పట్టించడానికి టీడీపీ, జనసేన కూటమి రంగం సిద్ధం చేసుకున్నట్లేనని అనుకోవచ్చు.