Eagle movie Review
తెలుగు360 రేటింగ్: 2.75/5
-అన్వర్
యాక్షన్ సినిమాలు తీయడం, తీసి మెప్పించడం అనుకొన్నంత సులభం కాదు. హాలీవుడ్ యాక్షన్లన్నీ నెట్ ఫ్లిక్సుల్లో దర్శనమిచ్చే వేళ… ప్రేక్షకుల్ని మెప్పించాలంటే అంతకు మించిన కంటెంట్, లేదా దానికి సరితూగేంత విషయం కథలో ఉండేలా చూసుకోవాలి. రవితేజ ‘ఈగిల్’ టీజర్, ట్రైలర్ చూసినప్పుడు ఇదో యాక్షన్ డ్రామా అనిపించింది. మరి ఆ యాక్షన్ రొటీన్ మూసలో కొట్టుకుపోయిందా? లేదంటే – నిలబడగలిగేంత సత్తా కథలో కనిపించిందా?
కథలోకి వెళ్తే… నళిని (అనుపమ పరమేశ్వరన్) ఓ జర్నలిస్ట్. విదేశాల్లో ఓ నేత చీర చూసి ముగ్థురాలవుతుంది. అది అరుదైన పత్తి నుంచి వచ్చిందని, ఆ పత్తి కేవలం భారదేశంలోని ఓ ప్రాంతంలోనే పండుతుందని, దాన్ని పండించిన వాడు కొంత కాలంగా కనిపించకుండా పోయాడన్న విషయం తెలుసుకొని, దాన్ని వార్తలా రాస్తుంది. అయితే ఆ వార్త వల్ల ‘రా’ అలెర్ట్ అవుతుంది. దేశానికి సంబంధించిన టాప్ సీక్రెట్ ఒకటి బయటకు వచ్చే ప్రమాదం ఉందని తెలుసుకొంటుంది. నళిని ఉద్యోగం పోతుంది. అప్పటి నుంచీ.. అసలు ఆ పత్తి వెనుక, దాన్ని పండించిన వాడి వెనుక ఎవరున్నారు? అనే విషయం తెలుసుకోవాలని రీసెర్చ్ మొదలెడుతుంది. ఆ ప్రయాణంలో సహదేవ్ (రవితేజ) గురించి తెలుస్తుంది. అక్కడ్నుంచి నిజాలన్నీ ఒకొక్కటిగా బయటకు వస్తాయి. అసలు సహదేవ్ ఎవరు? ఏం చేస్తుంటాడు? ఆ పత్తికీ తనకీ ఉన్న సంబంధం ఏమిటి? బాక్సైట్ గనులు, నక్సలైట్లు, ‘రా’, ఆయుధాలు… వీటి వెనుక ఉన్న ‘ఈగల్’.. ఆ వ్యవహారాలేంటి? అనేదే మిగిలిన కథ.
నళిని ఇన్వెస్టిగేషన్ అనే ఆసక్తికరమైన కోణం నుంచి కథ మొదలవుతుంది. ఓ చిన్న ఆర్టికల్ చూసి ‘రా’ ఎందుకు హడలిపోయింది? సహదేవ్ పేరు వినగానే పోలీసులు, ఎం.ఎల్.ఏ.. వీళ్లంతా ఎందుకు బెదిరిపోతున్నారు? అనే ఇంట్రస్ట్ క్రియేట్ అవుతుంది. ఆ తరవాత.. సహదేవ్ పాత్ర ను, ఆ పాత్రలోని లేయర్లని ఒకొక్కటిగా పరిచయం చేసుకొంటూ కథని ముందుకు నడిపారు. ఈ కథ మొదలెనప్పుడు పత్తి గురించో, చేనేత గురించో అనిపిస్తుంది. ఆ తరవాత బాక్సైట్ వ్యవహారం వెలుగులోకి వస్తుంది. అయితే ఇవేం కథలో కీలకం కావు. కేవలం కొన్ని భాగాలంతే. అసలు కథని, తాను చెప్పదలచుకొన్న విషయాన్నీ ఇంట్రవెల్ తరవాతే రివీల్ చేశాడు దర్శకుడు. తొలి సగంలో.. సహదేవ్ ఎవరు, ఈగల్ ఎవరు? వీళ్లిద్దరూ ఒక్కటేనా? అనే కుతూహలం కలిగించేలా సీన్లు రాసుకొన్నాడు. ఎలివేషన్లు, బిల్డప్పులు బాగానే ఉన్నా, రాను రాను ఎక్కువయ్యాయన్న ఫీలింగ్ కలుగుతుంది. కథని విప్పడానికి దర్శకుడు చాలా సమయం తీసుకొన్నాడు. ఇంట్రవెల్ కార్డు దగ్గర కూడా కథలోని సంఘర్షణ ఏమిటన్నది ఓపెన్ చేయలేదు. తాను దాచిన పాత్రలు చాలా వరకూ సెకండాఫ్‌లోనే వస్తాయి. అసలు పాయింట్ ఓపెన్ చేసేస్తే.. తరవాత చెప్పడానికి ఏం మిగలదు.. అని దర్శకుడు భావించి ఉంటాడు. అయితే యాక్షన్ సీన్లు బాగా రాసుకోవడం, డైలాగులతో హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంతో.. ఫస్టాఫ్ ఓకే అనిపిస్తుంది. ఇంట్రవెల్ బ్యాంగ్ లో వచ్చే యాక్షన్ సన్నివేశాన్ని బాగా డిజైన్ చేసుకొన్నారు. కొండపై కోటలోని ప్రతీ వస్తువూ బుల్లెట్ల వర్షం కురిపించడం మాస్‌కి నచ్చుతుంది.
సెకండాఫ్‌లో కథలోకి వెళ్లడం తప్పలేదు దర్శకుడికి. ఈసారి కథ ఫారెన్ షిఫ్ట్ అవుతుంది. అక్కడ హీరో ఏం చేస్తుంటాడో ఎట్టకేలకు రివీల్ చేశారు. హీరో ప్రేమ కథ ఓపెన్ అవుతుంది. తుపాకీ, బుల్లెట్ల సాక్షిగా హీరో, హీరోయిన్లు ప్రేమించుకోవడం బాగానే డిజైన్ చేశారు. అందులో కాస్త అతి అనిపించినా – చివరికు దర్శకుడు చెప్పిన విషయానికి ఇలాంటి ప్రేమ కథే యాప్ట్ అనిపిస్తుంది. హీరో రివైంజ్ ఎందుకోసమో, ఎవరి కోసమో అర్థమయ్యే సరికి చివరి మలుపు ఏమై ఉంటుందా? అని ఊహించడం పెద్ద కష్టమేం కాదు. చివర్లో కూడా యాక్షన్ ఎపిసోడ్లతోనే సినిమాకి రక్తి కట్టించే ప్రయత్నం చేశాడు. అమ్మవారి రూపం కూడా ఓ మిషన్ గన్లా మారడం – హైలెట్ సీన్. ఒక్కో ఎపిసోడ్ కి ఒక్కో పేరు పెట్టడం వెబ్ సిరీస్ ఫార్మెట్ ని గుర్తు చేస్తుంది. చివర్లో పార్ట్ 2 కూడా ఉందని చెప్పడం, అక్కడ కొన్ని యాక్షన్ ఘట్టాల్ని మచ్చుక్కి చూపించడం బాగున్నాయి.
అయితే ఈ సినిమా చూస్తున్నప్పుడు నోట్ చేసుకోదగిన పాయింట్లు కొన్ని కనిపించాయి. ప్రతీ పాత్ర.. గంభీరంగా మాట్లాడుతుంటుంది. మాటలు, ప్రాసలు బాగున్నా.. అదేదో కోడ్ లాంగ్వేజ్ లా అనిపిస్తుంది. నిజానికి అంత అవసరం లేదు. కొన్ని పాత్రలు సహజంగా మాట్లాడుకోవొచ్చు. పనోడు దగ్గర్నుంచి, పోలీస్ వరకూ అందరూ అర్థం కాని కవిత్వం వల్లించాల్సిన అసవరం లేదు. 14 దేశాలు అట్టుడికిపోయేంత క్రైమ్.. హీరో ఏం చేశాడో అంతు పట్టదు. దేశానికి సంబంధించిన అత్యంత పటిష్టమైన భద్రతా వ్యవస్థ కూడా హీరోని పట్టుకోవడానికి బెంబేలెత్తిపోతుంది. ఇదంతా సినిమాటిక్ లిబర్టీ అనుకోవాలి. ఆయుధంతో ప్రాణం తీయొచ్చు, ప్రాణమూ కాపాడవచ్చు అని చెప్పడం దర్శకుడి ఉద్దేశ్యం. దాన్ని చెప్పడానికి తాను కూడా ఓ విధ్వంసమే సృష్టించాడు.
రవితేజ గెటప్ కొత్తగా ఉంది. ఎప్పుడూ ఒకేలా కనిపించే రవితేజ ఈసారి సహదేవ్ పాత్రలో ఒత్తైన జుత్తు, గెడ్డంతో దర్శనమిచ్చాడు. ఈగిల్ పాత్రలో ఎప్పటిలానే కనిపించాడు. నటన విషయంలో కొత్తగా ఆవిష్కరించింది ఏమీ లేదు. అనుపమది రెగ్యులర్ హీరోయిన్ పాత్ర కాదు. ఓ ఇన్వెస్టిగేషన్ చేస్తూ, ఈ కథని ముందుకు నడిపించిన పాత్ర అది. మధుబాలకు మంచి రోల్ ఇచ్చారు కానీ సరిగా వాడుకోలేదు. ఇందులో బలమైన విలన్ లేడు. ఉన్నవాళ్లలో అజయ్ ఘోష్‌ని విలన్ అనుకోలేం. కమెడియన్ అనుకోలేం. అయితే శ్రీనివాసరెడ్డితో తన కామెడీ ట్రాక్ కాస్త రిలీఫ్ ఇస్తుందంతే. వినయ్ రాయ్ పాత్ర కూడా అంతంత మాత్రంగానే ఉంది. నవదీప్ సపోర్టింగ్ క్యారెక్టర్లో ఆకట్టుకొన్నాడు.
నిర్మాణ విలువలు హై క్లాస్‌లో ఉన్నాయి. దర్శకుడు రాసుకొన్న ప్రతీ సీన్ తెరపై ఎలివేట్ అయ్యాయంటే కారణం.. ప్రొడక్షన్ వాల్యూస్. ఫొటోగ్రఫీ, నేపథ్య సంగీతం, యాక్షన్ కొరియోగ్రఫీ అన్నీ బాగా కుదిరాయి. పాటలకు స్కోప్ లేదు. ఉన్న రెండు పాటలూ అంతంత మాత్రంగానే అనిపించాయి. నిజానికి అవి లేకపోయినా రన్ టైమ్ కలిసొచ్చేది. మాటలు బాగున్నాయని అనిపిస్తాయి కానీ, ప్రతీ పాత్ర ఒకే స్కేల్ లో మాట్లాడడం మాత్రం నచ్చదు. కార్తీక్ ఘట్టమనేని తన టెక్నికల్ టీమ్ ని బాగా వాడుకొన్నాడు. ఓ రొటీన్ స్టోరీనే స్క్రీన్ ప్లేతో, ఎలివేషన్లతో, యాక్షన్ ట్రీట్ మెంట్ తో కొత్తగా చెప్పాలనే ప్రయత్నం చేశాడు. మొత్తంగా చూస్తే రవితేజ రెగ్యులర్ సినిమాకంటే ‘ఈగిల్’ భిన్నంగా కనిపిస్తుంది.
ఫినిషింగ్ టచ్: ఓ మొండోడి మారణ హోమం
తెలుగు360 రేటింగ్: 2.75/5
-అన్వర్