అసెంబ్లీకి టైగర్ వస్తుందంటూ కేసీఆర్ గురించి కేటీఆర్ చాలా ఎలివేషన్లు ఇచ్చారు. నిజమా .. ఆయన కూడా రావాలనే తాము కోరుకుంటున్నామని రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి.. ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించడంతో కేసీఆర్ గత వైభవం అంతా మర్చిపోయి.. ప్రతిపక్ష నేతగా రేవంత్ ను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారని అనుకున్నారు. కానీ ఆయన సభకు రావడం లేదు. గవర్నర్ ప్రసంగానికి రాలేదు. సాధారణంగా గవర్నర్ ప్రసంగానికి ప్రతిపక్ష నేత వస్తారు.
అలా రావడం గౌరవం కూడా. కానీ రాలేదు. పోనీ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చకు అయినా వస్తారేమో అనుకున్నారు. కానీ రాలేదు. దీంతో రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అసెంబ్లీని అవమానిస్తున్నారని మండిపడ్డారు . పార్టీ సమావేశాలకు బాగుండే ఆరోగ్యం… అసెంబ్ల్లీ సమావేశాలకు బాగుండదా అని ప్రశ్నించారు. నిజానికి బీఏసీ సమావేశానికి కేసీఆర్, కడియం శ్రీహరి హాజరవుతారని ఆ పార్టీ నేతలు పేర్లు ఇచ్చారు. దీంతో ఆయన హాజరవుతారని అనుకున్నారు.
కానీ సమావేశానికి మాత్రం ఆయన స్థానంలో హరీశ్ రావు వెళ్లారు. నిబంధనల ప్రకారం ముందు పేర్లిచ్చిన వారే రావాలని మంత్రి శ్రీధర్ బాబు సమాధానమివ్వగానే ఆయన వెనుదిరిగారు.అంతకు ముందు ప్రతిపక్ష నేత చాంబర్ ను స్పీకర్ మార్చారు. చిన్న గది ఇచ్చారని.. ఆరోపించారు. అసెంబ్లీకి వస్తే అలాంటి అవమానాలు ఉంటాయని.. కేసీఆర్ వెనుకడుగు వేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది.