వాలంటీర్లను జగన్ రెడ్డి ప్రభుత్వం తొలగించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఎన్నికల్లో వాలంటీర్ల వినియోగంపై ఈసీ తీవ్ర ఆంక్షలు పెట్టే అవకాశం ఉంది. ఓటర్లను ప్రభావితం చేస్తారు కాబట్టి.. వారి వద్ద ఉన్న ప్రభుత్వానికి చెందిన ఫోన్లు.. . స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ప్రక్రియలో ఎలాంటి జోక్యం చేసుకున్నా వారిపై కేసులు పెడతారు. అందుకే వైసీపీ చీఫ్ ప్లాన్డ్ గా ఆలోచించి… వాలంటీర్లను తీసేయాలని నిర్ణయించుకుందని చెబుతున్నారు.
తాజాగా వైసీపీ ప్రభుత్వం ఓ జీవో జారీ చేసింది. దాని ప్రకారం వాలంటీర్లకు ఇచ్చే బహుమతుల విలువను రెండు వందల యాభై కోట్ల నుంచి ఐదు వందల కోట్లకు పెంచారు. ఈ డబ్బులన్నీ వారికి పంచిన తర్వాత తీసేస్తున్నట్లుగా ఉత్తర్వులు ఇస్తారు. వైసీపీ మళ్లీ రాగానే పెంచిన జీతంతో తీసుకుంటామని హామీ ఇస్తారు. ఎన్నికల్లో వైసీపీ కోసం పని చేయించుకుంటారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రజల సమాచారం మొత్తం సేకరించినందున ఆ డేటాను వాడుకుని ఎన్నికల్లో వైసీపీకి పని చేస్తారు. వాలంటీర్లుగా తొలగించినందున వారిపై ఈసీ ఆంక్షలు విధించలేదు. ఈ ప్లాన్ తోనే ముందుగానే వాలంటీర్లకు ఐదు వందల కోట్లు పంచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని అంటున్నారు.
అయితే వాలంటీర్లను తొలగిస్తే పార్టీ ఫోల్డ్ నుంచి జారిపోతారని.. .. టీడీపీ నేతలు ఎక్కువ డబ్బులిస్తే వారికే పని చేస్తారన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో ఉంది. అత్యధిక మంది తమ పార్టీ కార్యకర్తలేనని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు.. కానీ ఇప్పుడు గతంలో గెలిపించిన క్యాడర్ నే నట్టేట ముంచిన జగన్ రెడ్డి వాలంటీర్లను మాత్రం ఆదుకుంటారన్న గ్యారంటీ ఏమిటన్న చర్చ జరుగుతోంది. అందుకే వాలంటీర్లు వచ్చే ఎన్నికల్లో ఎన్ని చేసినా వైసీపీ పుట్టి ముంచడంలో భాగం అవుతారు తప్ప.. ఓట్లు సంపాదించే అవకాశం ఉండదన్న అంచనాలు ఉన్నాయి.