వైసీపీ కొత్త ఇంచార్జులు… పాత ఎమ్మెల్యేలు పోటీ చేయలేమని చేతులెత్తేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఈ దిశగా సంకేతాలు ఇచ్చారు. ప్రచారం కూడా ప్రారంభించలేదు. దీంతో కొంత మందిని మార్పు చేశారు. వచ్చే రోజుల్లో ఇంకా చాలా మంది పోటీకి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అవనిగడ్డ, నెల్లూరు ఎంపీ, చిలుకలూరిపేట వంటి చోట్ల అభ్యర్థులు ప్రచారాలు కూడా చేయడం లేదు. అనేక చోట్ల సమన్వయకర్తలుగా నియమితులైన వాళ్లు.. చివరి క్షణంలో జగన్ రెడ్డి హ్యాండిస్తారని క్లారిటీ ఉండటంతో ఖర్చు ఎందుకు దండగని ఊరకుండిపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల కష్టాలు అన్నీఇన్నీ కావు. ఇప్పటికే వైఎస్ జగన్ ఆరు జాబితాలు విడుదల చేశారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు నియోజకవర్గాలకు ఈ నెలాఖరులోగా పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదల చేసే పనిలో ఉన్నారు. మొదటి జాబితా జనవరిలోనే ప్రకటించారు. తరువాత రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు జాబితాలు విడుదల చేశారు. మొత్తం 82 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. రేపో, మాపో ఏడో జాబితా కూడా రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అభ్యర్థిత్వాలు ఖరారైన వారు.. ఫ్లెక్సీలు వేసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ.. జనంలోకి వెళ్లడంలేదు.
సమన్వయకర్తగా నియమించిన తర్వాత రోజు నుంచి ప్రజల్లోకి వెళ్తున్నారో లేదో పార్టీ హైకమాండ్ ట్రాక్ చేస్తోంది. అత్యధిక మంది తూతూ మంత్రంగా పని చేస్తున్నారని తేలింది. అయితే ప్రతీ దానికి వైసీపీ నాయకత్వం నేతల్ని పిండుకోవడానికే ప్రయత్నిస్తోంది. చివరికి యాత్ర సినిమా టిక్కెట్లను కూడా కొని ప్రజలకు పంచాలని ఆదేశాలివ్వడంతో చాలా మంది ని విస్మయానికి గురి చేస్తోంది. అంతగా అయితే టీవీల్లో ప్రసారం చేస్తే సరిపోతుంది కదా… మా దగ్గర డబ్బులు వసూలు చేయడం ఎందుకని అనుకుంటున్నారు.
వైసీపీ గెలిచే అవకాశం లేదని బలంగా ప్రచారం జరుగుతూండటంతో.. డబ్బులైనా మిగుల్చుకోవచ్చని ఎక్కువ మది సైలెంట్ అవుతున్నారు. వచ్చే నెల రోజుల్లో ఈ పరిస్థితి మరింత ఘోరంగా ఉండే అవకాశం ఉంది.