వైసీపీలో అభ్యర్థులే కాదు.. ీజినల్ కోఆర్డినేటర్ల విషయంలోనూ గందరగోళం నెలకొంది. ఎవరు ఏ నియోజకవర్గానికి బాధ్యులో కూడా తెలియనంతగా ఈ గందరగోళం పెరిగిపోతోంది. కోఆర్డినేటర్లు.. వారికి డిప్యూటీలు ఇలా మారిపోతోంది రాజకీయం. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి మెల్లగా వైరస్ పాకినట్లుగా ఆ పార్టీలో పాకిపోతున్నారు. మొదట ఒంగోలు లోక్ సభ అభ్యర్థి అన్నారు. తర్వాత వేమిరెడ్డి దూరమయ్యే సరికి ఇప్పుడు ఆయన బాధ్యతలు కూడా.. చెవిరెడ్డికే ఇచ్చారు. సాయిరెడ్డి కూడా కోతవేసి ఆ బాధ్యతలూ ఆయనకే ఇచ్చారు.
ఇక ఉత్తరాంధ్రలో విశాఖకు వైవీ.. మిగతా రెండు ఉమ్మడి జిల్లాలకు బొత్స ఉండేవారు. తర్వాత బొత్సను పక్కన పెట్టి వైవీకి ఇచ్చి.. ఆయనకు అసిస్టెంట్ గా బొత్స మేనల్లుడిని నియమించారు. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ కు విశాఖ వరకూ వైవీ సుబ్బారెడ్డికి డిప్యూటీగా నియమించారు. అసలుకే దిక్కులేదు అంటే.. డిప్యూటీ పదవులు ఏమిటో అని వారు కంగారు పడుతున్నారు. అసలు ఈ పదవులేమిటో వారికి తెలియదు.. ఏం చేయాలో కూడా తెలియదు. అలా బండి నడిపేస్తున్నారు.
అభ్యర్థుల విషయంలో మేకకు తోక… తోకకు మేక అన్నట్లుగా రాజకీయం చేస్తున్నారు. అటూ ఇటూ అభ్యర్థుల్ని మారుస్తున్నారు. చివరికి ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో స్పష్టత లేకుండా పోయింది. ఇప్పుడు రీజినల్ కోఆర్డినేటర్ల విషయంలోనూ అంతే. చివరికి ఆ పార్టీలో పరిస్థితి ఎక్కడిదాకా వెళ్తుందో చెప్పడం కష్టంగా మారుతోంది.