కేసీఆర్ చేస్తున్న ప్రాజెక్టు రాజకీయాలకు గట్టి కౌంటర్ ను కాంగ్రెస్ రెడీ చేసింది. అసెంబ్లీలో వైట్ పేపర్ ప్రకటించబోతున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షంపై దూకుడుగానే వ్యవహరించాలనీ, ఎట్టి పరిస్థితుల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సబ్జెక్ట్ విషయంలో తడబడవద్దని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి సూచనలు ఇచ్చారు.
బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులపై సోమవారం శాసనసభలో శ్వేతపత్రం ప్రకటించనున్నందున ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు సాగునీటి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు కూడా దీనిలో పాల్గొన్నారు. ప్రాజెక్టుల డిజైన్, దానిలోని లోపాలు, రీ డిజైనింగ్ పేరుతో మార్పులు, అంచనా వ్యయం, ఆ తర్వాత పెంచిన వ్యయం, ఆయా ప్రాజెక్టుల నిర్మాణం వల్ల సాగులోకి వచ్చిన భూమి ఎంత? ప్రాజెక్టుల డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు లో ఏమని పేర్కొన్నారు? దానికి భిన్నంగా నిర్మాణాలు ఎలా చేశారు? నిర్మాణాల్లోని నాణ్యత, ఏఏ ప్రాజెక్టుల్లో ఎంత అవినీతి జరిగింది అనే అంశాలపై వారికి అవగాహన కల్పించారు.
కృష్ణా నదిపై ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించే విషయంలో నెలకొన్న వివాదంపైనా ప్రజాప్రతినిధులకు స్పష్టత ఇచ్చారు. గడచిన పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వమే కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తామని కేంద్ర సమావేశాల్లో సంతకాలు చేసి రావడం, రాష్ట్రంలో అందుకు భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నం చేయడం వంటి పలు అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ఎవరెవరు ఏఏ అంశాలు మాట్లాడాలో కూడా వారికి దిశానిర్దేశం చేశారు. అలాగే 13వ తేదీ కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ బ్యారేజ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సందర్శించనున్నారు.