నారాయణ ఈ పేరు వింటే స్కూళ్లు, కాలేజీలే గుర్తుకు వస్తాయి. ఓ చిన్న స్థాయి టీచర్ గా కెరీర్ ప్రారంభించి దేశంలోనే ప్రముఖ విద్యా సంస్థల నెట్ వర్క్ ను స్థాపించడంలోనే నారాయణ సామర్థ్యం కనిపిస్తుంది, ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీకి మొదట పరోక్షంగా పని చేశారు. గత ఎన్నికల్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఎన్నికల్లో పోటీ చేసిన మొదటి సారి ఆయన చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయారు. నెల్లూరులో గతంలో ఏ ప్రజాప్రతినిధి చేపట్టనంత భారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఆయన ఓడిపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అదే ఈ సారి సానుభూతిగా మారింది.
ఓటమి ఖాయమని అనిల్ కుమార్ను తప్పించిన వైసీపీ
2014, 2019 ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచారు. అయితే ఆయనను ఇప్పుడు నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని వైసీపీ హైకమాండ్ ఆదేశించడంతో సింహపురి రాజకీయం మారిపోయింది. అయితే అభ్యర్థిగా తన అనుచరుడ్నే ఖరారు చేయించుకున్నారు అనిల్ కుమార్. కానీ ఇప్పుడు ఆయన నెల్లూరు రాజకీయాల్లో ఒంటరి. త ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ గెలుపులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి వంటి నాయకుల సపోర్ట్ చాలా పని చేసింది. నెల్లూరు సిటీ నియోజకవర్గంపై బలమైన ప్రభావం చూపగల ఆనం, కోటంరెడ్డి టీడీపీలో చేరిపోయారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా దూరమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో వైసీపీ పరిస్థితి రాను రాను గడ్డుగా మారుతోంది.
గత ఎన్నికల్లో ఒక్క శాతం తేడాతో నారాయణ పరాజయం
2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ 47 శాతం ఓట్లు సాధించారు. టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణకు 46 శాతం ఓట్లు వచ్చాయి. జనసేన అభ్యర్థి కేతం రెడ్డి వినోద్ రెడ్డి 3 శాతం ఓట్లు సాధించారు. ఇతరులకు 4 శాతం ఓట్లు వచ్చాయి. కాపు సామాజికవర్గం సహా టీడీపీ సంప్రదాయ ఓటు బ్యాంకు అంతా నారాయణవైపే ఉంది. ఈ సారి జనసేన మద్దతు కూడా కలసి వస్తోంది. అదే సమయంలో నారాయణపై వేధింపులపై ప్రజల్లో సానుభూతి కనిపిస్తోంది. నారాయణపై కేసులు పెట్టడం.. తప్పుడు కేసుల్లో అరెస్టులకు ప్రయత్నించడం..ఆయన కుటుంబసభ్యులపై వేధింపులకు పాల్పడటం వంటివి చేయడంతో ప్రజల్లో ఆయనపై సానుభూతి వైసీపీ నేతలపై ఆగ్రహం కనిపిస్తోంది. నారాయణ సౌమ్యుడు. విద్యావేత్త. ఆయనపై ఎలాంటి ఆరోపణలు లేవు.
వైసీపీతో ముసలంతో అసలుకే మోసం !
నిజానికి మొదటి నాలుగేళ్లు నెల్లూరులో టీడీపీ అత్యంత గడ్డు పరిస్థితి ఎదుర్కొంది. నెల్లూరు కార్పోరేషన్ ఎన్నికల్లోనూ టీడీపీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఒక్కటంటే ఒక్క వార్డు కూడా టీడీపీ గెలుచుకోలేకపోయింది. కానీ ఎప్పుడైతే వైసీపీలో ముసలం ప్రారంభమయిదో అప్పట్నుంచి నెల్లూరులోనూ సీన్ మారిపోయింది. నారాయణ హయాంలో బాగా అభివృద్ధి పనులు జరగగా… గత ఐదేళ్లగా పనులు ఆగిపోయాయి. నెల్లూరు సిటీలో సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం.. సీసీ రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారడం వంటివి పరిష్కరించకపోవడం సస్యగా మారింది.
నారాయణ విజయాన్ని ఆపలేమని గుర్తించిన వైసీపీ ఆయన వ్యాపారాలపై దాడులు చేసి తమ పార్టీలో చేరాలని ఒత్తిడి చేస్తోంది. కానీ ఇంత కాలం తట్టుకున్నా.. ఇప్పుడెందుకు వెనక్కి తగ్గుతానని .. చేతనైంది చేసుకోమని నారాయణ సవాల్ చేస్తున్నారు.