కేవలం పొలిటికల్ మైలేజీ పెంచుకోవడానికి వైకాపా తీయించిన సినిమా ‘యాత్ర 2’. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లెద్దు. ఇలాంటి సినిమా ఒకటి వచ్చినప్పుడు ఆ పార్టీకి అంతో ఇంతో ప్లస్ అవ్వాలి. కానీ.. ‘యాత్ర 2’ వల్ల.. అన్నీ మైనస్సులే! ముఖ్యంగా ఈ సినిమాలోని చాలా డైలాగులు, సీన్లూ ఆ పార్టీపై ట్రోలింగుకు ఉపయోగపడ్డాయి. మీమర్స్‌కి కొత్త కంటెంట్ స్వయంగా పార్టీ వాళ్లే ఇచ్చినట్టైంది. జగన్‌పై చాలా రకాల సందేహాల్ని ఈ సినిమా మరింతగా పెంచింది. షర్మిల పాత్ర లేకపోవడం, కనీసం ఆమె ప్రస్తావన కూడా తీసుకురాకపోవడం బయట ఉన్న అనుమానాలన్నీ నిజాలే అని రూఢీ అయిపోయేలా చేసింది.
అన్నింటికీ మించి ఈ సినిమా అట్టర్ ఫ్లాప్. రూ.40 కోట్లతో తీసిన సినిమాకు కనీసం రూ.10 కోట్లు కూడా వెనక్కి రాని పరిస్థితి. తమ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఏకంగా 151 స్థానాల్ని గెలుచుకొంది. ఎం.ఎల్.ఏల బలం ఉంది. అయినా వాళ్లెవరూ ఈ సినిమాని పట్టించుకోలేదు. ఫ్రీ టికెట్లు ఇచ్చి జనాల్ని ధియేటర్లకు తరలించాలన్న ప్రయత్నం చేసినా ఆ వ్యవహారం కూడా అంతంత మాత్రంగానే సాగింది. దాంతో క్యాడర్ పై జగన్ గుర్రుగా ఉన్నారు. కనీసం టికెట్లు పంచిపెట్టి, జనాల్ని థియేటర్లకు పంపలేనివాళ్లు.. ఈసారి ఎన్నికల్లో ఎలా గెలుస్తారు? ‘యాత్ర 2’ని హిట్ చేయించలేదన్న కారణం చాలు.. ఆయన తన క్యాడర్లోని కీలకమైన వ్యక్తుల్ని దూరం పెట్టడానికి. అలా.. జగన్‌కీ, అనుచరగణానికీ మధ్య ఈ సినిమా దూరం పెంచింది.
ఇప్పుడు కొత్తగా స్కామ్ ఒకటి. తమ కోసం సినిమా తీసి పెట్టిన మహి.వి.రాఘవకి ఏదైనా చేయాలి కదా? అందుకే 2 ఎకరాల భూమి ఉత్త పుణ్యానికి రాసివ్వడానికి రంగం సిద్ధం చేశారు. ఓ ప్రధాన పత్రిక సాక్ష్యాధారాలతో సహా ఈ స్కామ్ ని బయటపెట్టడంతో ప్రభుత్వంపై విమర్శల దాడి మొదలైంది. ‘యాత్ర 2’ సినిమా లేకపోతే.. ఈ భూముల గోల లేకపోయేది కదా? ఇలా మొత్తానికి ఏ రూపంలో చూసినా ‘యాత్ర 2’ వైకాపా మైలేజీని మరింత దారుణంగా దెబ్బ కొట్టింది. త్వరలో రాంగోపాల్ వర్మ ‘వ్యూహం’తో వస్తున్నాడు. వర్మ సినిమాల్లో కంటెంట్, క్వాలిటీ ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమాతో ఇంకెంత పరువు పోతుందో?