కృష్ణా ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ పై ఆరోపణలు చేస్తూ.. బహిరంగసభకూ రెడీ అయిన కేసీఆర్.. అదే అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వం చర్చకు పెడితే డుమ్మా కొట్టారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి అడ్వాంటేజ్ తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీని కార్నర్ చేశారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ప్రజలు కృష్ణాపై ఆధారపడి జీవిస్తున్నారు.. మహానుభావుడు ప్రతిపక్ష నాయకుడు సభకు రాకుండా తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు.
ప్రజలకు సందేశాన్ని ఇవ్వాల్సిన ఆయన సభకు రాకుండా ఫామ్ హౌస్ లో దాక్కున్నారని.. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేది లేదని, జలాల్లో 68శాతం వాటా తెలంగాణకు ఇవ్వాలని ప్రభుత్వం తీర్మానం చేసిందని స్పష్టం చేశారు. ఈ తీర్మానానికి అనుకూలమో, వ్యతిరేకమో విపక్ష నేతలు స్పష్టత ఇవ్వాలన్నారు. దొంగలకు సద్దులు మోసే వ్యవహారం మంచిది కాదన్నారు. ఇంత ముఖ్యమైన చర్చ జరుగుతుంటే ప్రతిపక్ష నాయకుడు సభకు రాకపోవడం ఏమిటని ప్రశ్నించారు.
కేసీఆర్ ను సభలోకి పిలవాలని బీఆర్ఎస్ సభ్యులను రేవంత్ డిమాండ్ చేశారు. పదేళ్లలో జరిగిన పాపాలకు కారణం కేసీఆర్ ..ఆయన సభలోకి వస్తే ఎంతసేపైనా చర్చకు సిద్ధమన్నారు. వాళ్ల నాయకులు మాట్లాడే మాటలకు విలువ లేదని.. చేపల పులుసుకు అలుసు ఇచ్చి.. కృష్ణా జలాలను ఎవరు తెగనమ్ముకున్నారో చర్చిద్దామన్నారు. హరీష్ రావుతో .. కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు… కానీ ఆయన మాటలకు రావాల్సింత ఫోకస్ రాలేదు. కేసీఆర్ మాట్లాడితే వచ్చే ఎఫెక్ట్ వేరు. ఇది మంచి అవకాశమే అయినా కేసీఆర్ ఎందుకు డుమ్మా కొట్టారో బీఆర్ఎస్ నేతలకూ అర్థం కాలేదు.
ప్రాజెక్టులకు కేంద్రానికి అప్పగింది లేదన్న తీర్మానానికి బీఆర్ఎస్ మద్దతు తెలుపడంతో.. రేపటి నల్లగొండ సభకు అర్థం లేకుండా పోయింది. మొత్తంగా కేసీఆర్ గైర్హాజరు కావడంతో.. తమకు అనుకూలంగా మారుతుందనుకున్న వ్యవహారం కాస్తా .. కాంగ్రెస్ తనకు అనుకూలంగా మల్చుకున్నట్లయింది.