అసెంబ్లీలో కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై యుద్ధం జరిగింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీ తలపడ్డాయి. ఎవరి వాదన వారు వినిపించారు. ఇందులో రాజకీయం ఉందా.. రాష్ట్ర ప్రయోజనాలు ఉన్నాయా అన్న సంగతి తర్వాత కానీ.. అసలు విషయం రెండు పార్టీలు కలిసి బీజేపీని పరోక్షంగా విలన్ ను చేశాయి. ఈ వ్యవహారంలో బీజేపీ ఆటలో అరటిపండుగా మారింది.
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కు ప్రాజెక్టులను అప్పగించిన వ్వవహారంపై అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. ఈ చర్చ సారాంశం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వమే ప్రాజెక్టులను బలవంతంగా తీసుకుంటూ తెలంగాణకు అన్యాయం చేస్తుందన్న సందేశం ఇవ్వడం. బీఆర్ఎస్ నేతలు అదే తరహా ప్రసంగాలు చేశారు. కాంగ్రెస్ నేతలూ అదే చెప్పారు. అయితే ఇక్కడ రాజకీయం ఏమిటంటే వీరి ప్రసంగాల్లో ఎక్కడా కేంద్రాన్ని తప్పు పట్టలేదు. కానీ.. అసలు విలన్ కేంద్రమేనన్న సంకేతాలను గట్టిగా పంపారు. ఈ రాజకీయం చూసి ఎలా స్పందించాలో బీజేపీ నేతలకు అర్థం కాలేదు. బీఆర్ఎస్ ట్రాప్లో పడొద్దని కాంగ్రెస్ కు విజ్ఞప్తి చేశారు..తాత్కాలిక బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి
తాము ప్రాజెక్టులు అప్పగించబోమని తీర్మానం చేసింది కాంగ్రెస్.. బీఆర్ఎస్ సమర్థించింది. మరి బీజేపీ ఎక్కడ ?. రెండు విధాలుగా ఇరుక్కుపోయింది బీజేపీ అందుకే సైలెంట్ అయిపోయింది. కృష్ణా ప్రాజెక్టుల్ని తాము కాపాడుతున్నామంటే.. తాము కాపాడుతున్నామని బీఆర్ఎస్, కాంగ్రెస్ అసెంబ్లీ వేదికగా వాదించుకుటంున్నాయి. నిజానికి విభజన చట్టం పాస్ అయినప్పుడే కేంద్రం అధీనంలోకి ప్రాజెక్టులు వెళ్లాయి. పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. అప్పుడు కృష్ణా ప్రాజెక్టులపై KRMB అజమాయిషీ మొదటి నుంచి ఉంది.
ఇప్పుడు కొత్తగా అధీనంలోకి తీసుకోవడం అంటే.. భద్రతను చేపట్టడం. కేంద్ర బలగాల పరిధిలోకి ప్రాజెక్టుల భద్రత తీసుకోవడం. ఇది ఎందుకు జరిగిందంటే.. పోలింగ్ రోజు ఏపీ సర్కార్ చేసిన నిర్వాకం వల్ల జరిగింది. పోలింగ్ రోజు సాగర్ డ్యాంపై ఏం జరిగిందో అందరూ చేశారు. ప్రాజెక్టును ఆక్రమించుకున్న ఏపీ పోలీసులు బలవంతంగా గేట్లు కూడా ఎత్తేసుకున్నారు. మరోసారి అలా జరగకుండా కేంద్రం రక్షణ ఏర్పాటు చేసింది. చివరికి కృష్ణ ప్రాజెక్టుల అంశంలో బీజేపీ కార్నర్ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.