జగన్ మోహన్ హన్ రెడ్డి ఏడో జాబితా విడుదల చేయడానికి టెన్షన్ పడుతున్నారు. రెండు, మూడు రోజులకు ఓ జాబితా విడుదల చేస్తూ వచ్చారు కానీ ఇప్పుడు మాత్రం ఆగిపోయారు. దీనికి కారణం రాజ్యసభ ఎన్నికలు . టీడీపీ పోటీ పెట్టకపోతే ఏ సమస్యా ఉండదు. కానీ టీడీపీ పోటీ పెడుతుందా లేదా అన్నదానిపై మాత్రం స్పష్టత లేదు. పోటీ చేయడానికి అవసరమైన దరఖాస్తు రెడీ చేశారు. అభ్యర్థి ఎవరన్నది ఖరారు చేసి నామినేషన్ వేయడమే మిగిలింది.
టీడీపీ పోటీ చేస్తే ఓటింగ్ జరుగుతుంది. ఆ ఓటింగ్ జరిగితే ఎన్నిక పూర్తయ్యే వరకూ జగన్ రెడ్డికి టెన్షన్ ఉంటుంది. ఎమ్మెల్యేల ఓట్లను కాపాడుకోవడానికి చేయగలిగినంత చేయాలి. కొత్తగా ఎలాంటి జాబితాలను ప్రకటించలేరు. అలా ప్రకటిస్తే మరింత మంది దూరమవుతారు. అయితే జగన్ రెడ్డి నమ్మక ద్రోహం గురించి తెలిసిన చాలా మందికి ఇప్పటికీ .. తమకు టిక్కెట్ ఇస్తారా లేదా అన్నదానిపై ఓ స్పష్టత ఉంది. వారెలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది కీలకంగా మారింది.
టీడీపీ రాజ్యసభ పోటీ విషయంలో గుంభనంగా వ్యవహరిస్తోంది. పోటీ పెడతామో లేదో … బయటకు చెప్పడం లేదు. తెలియనివ్వడం లేదు. వైసీపీకి ఇదే పెద్ద టెన్షన్ లా ఉంది. ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయలేరు. వేసినా ఓటర్ల లిస్ట్ ప్రకారం వారికి ఓటు ఉంటుంది. ఈ ప్రకారం చూస్తే మరో ఇరవై మంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేస్తే టీడీపీ అభ్యర్థి గెలుస్తారు. ఆ ఇరవై మంది టచ్ లో ఉన్నారని టీడీపీ అనుకుంటే అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉంది. టీడీపీ అభ్యర్థి గెలిస్తే… వైసీపీ ముందుగానే ఓడిపోయినట్లవుతుంది.