లోక్ సభ ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో దేశంలో అతిపెద్ద పార్లమెంట్ సెగ్మెంట్ మల్కాజ్గిరి హాట్ టాపిక్ గా మారింది. మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలో దేశంలోని అన్ని రాష్ట్రాల, ప్రాంతాల ప్రజలు ఉంటారు. అందుకే మల్కాజ్ గిరి అంటే మినీ ఇండియాగా పేరుంది. పైగా దేశంలోని అతిపెద్ద లోక్ సభ సెగ్మెంట్లలో కూడా మల్కాజ్ గిరి ఒకటి కాగా, సీఎం రేవంత్ రెడ్డి మొన్నటి వరకు ఇక్కడి నుండే ప్రాతినిధ్యం వహించారు.
ఇప్పుడు ఈ మల్కాజ్ గిరిపై నేతలంతా ఫోకస్ చేస్తున్నారు. ప్రధాన పార్టీలన్నింటిలోనూ మల్కాజ్ గిరి స్థానంకు భారీగా పోటీ ఉంది. విద్యావేత్తలు, పారిశ్రామిక వేత్తలు, సీనియర్ నేతలు ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు లాబియింగ్ స్టార్ట్ చేయడంతో ఈ సీటుపై బిగ్ డిబేట్ జరుగుతోంది. గెలుపు గుర్రాల వేటలో ప్రధాన పార్టీలన్నీ నిమగ్నమయ్యాయి.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర ఓటమి పాలైనప్పటికీ గ్రేటర్ పరిధిలో మంచి ఫలితాలు రాబట్టింది. దీంతో మల్కాజ్ గిరి సీటు సేఫ్ అన్న ఉద్దేశంతో… మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. మల్కాజ్ గిరి పరిధిలోని మేడ్చల్, మల్కాజ్ గిరిలో మల్లారెడ్డి, ఆయన అల్లుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీరికి భారీ అనుచరగణం కూడా ఉండగా, గతంలో మల్కాజ్ గిరి నుండి మల్లారెడ్డి ఎంపీగా కూడా పనిచేశారు. దీంతో సీటు తమకే అని మల్లారెడ్డి ఫ్యామిలీ డిసైడ్ అయ్యింది. ఇదే సీటును ఆశించిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సీటు రాదని తెలిసి కాంగ్రెస్ గూటికి వెళ్లిపోయారు. ఇక ఇదే సీటు నుండి కేటీఆర్ ను కూడా బరిలో దింపే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. ఇక ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో పాటు మరో పారిశ్రామికవేత్త కూడా టికెట్ రేసులో ఉన్నారు.
ఇక కాంగ్రెస్ నుండి కూడా అంతే డిమాండ్ ఉంది. అధికార పార్టీ కావటంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతో కాంగ్రెస్ ఉంది. ఇక్కడి నుండి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి పోటీ చేస్తారని వార్తలు వినిపించాయి. తాజాగా కాంగ్రెస్ గూటికి చేరిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వంటి వారు రేసులో ఉండగా, మంత్రి తుమ్మలకు ఇక్కడ ఇంచార్జ్ ఇవ్వటంతో గెలుపుపై కాంగ్రెస్ నమ్మకంగా ఉంది.
ఈసారి మోడీ-అమిత్ షాపైనే భారం వేసిన బీజేపీ నుండి కూడా మల్కాజ్ గిరి కోసం భారీ డిమాండ్ ఉంది. నార్త్ ఇండియా నుండి ఎక్కువ మంది నివాసముంటున్న సీటు కావటంతో గెలుపు హిజీ అవుతుందన్న ఆశలు నేతల్లో ఉన్నాయి. ఇటీవల గజ్వేల్, హుజురాబాద్ నుండి పోటీ చేసిన ఈటల రాజేందర్ తో పాటు విద్యాసంస్థల అధినేత మల్క కొమురయ్య, మాజీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు, సీనియర్ నేత మురళీధర్ రావు, రామకృష్ణ, కరుణ గోపాల్, కృష్ణ సాగర్ రావులు సీటు రేసులో ఉన్నారు. మురళీధర్ రావు ఓ అడుగు ముందు వేసి టికెట్ ప్రకటించకున్నా, ప్రచారం కూడా షురూ చేశారు.