ఇది రీ రిలీజుల సీజన్. ప్రతీ నెలా ఏదో ఓ సినిమా రీ రిలీజ్ పేరుతో థియేటర్ ముందుకు వస్తోంది. ఈసారైతే ఏకంగా 5 సినిమాలు రీ రిలీజ్ కానున్నాయి. 14న ప్రేమికుల రోజు సందర్భంగా క్లాసిక్ లవ్ స్టోరీలన్నీ కట్టకట్టుకొని థియేటర్లలో దిగిపోవడానికి సిద్ధమయ్యాయి. వాటిలో తొలిప్రేమ, ఓయ్, బేబీ, సూర్య సన్నాఫ్ కృష్ణన్.. ఉన్నాయి. హిందీ నుంచి కూడా జబ్ వుయ్ మెట్ లాంటి లవ్ స్టోరీలు మరోసారి విడుదలకు నోచుకొంటున్నాయి.
ఈవారం ఫ్రెష్ సరుకూ దిగుతోంది. అందులో ‘ఊరు పేరు భైరవకోన’ ఒకటి. సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని ఈనెల 16న విడుదల చేస్తున్నారు. అంతకంటే ముందే పెయిడ్ ప్రీమియర్లు పడబోతున్నాయి. మమ్ముట్టి థ్రిల్లర్ ‘భ్రమయుగం’ కూడా ఈవారమే వస్తోంది. పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ లో తీసిన సినిమా ఇది. ప్రచార చిత్రాలు ఆకట్టుకొంటున్నాయి. పొలిటికల్ హీట్ పెంచడానికి ‘రాజధాని ఫైల్స్’ వస్తోంది. జగన్ ప్రభుత్వం అమరావతి రైతులకు చేసిన అన్యాయం చుట్టూ ఈ సినిమా నడుస్తుంది. ఇప్పటికే ట్రైలర్ సంచలనం సృష్టించింది. ఇందులో జగన్ చేసిన కుట్రపూరిత రాజకీయాన్ని కళ్లకు కట్టినట్టు సమాచారం. రాజకీయంగా ఈ చిత్రం మరిన్ని ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది. ప్రియమణి నటించిన ‘భామాకలాపం 2’ కూడా ఆహాలో విడుదల అవుతోంది. కొన్ని థియేటర్లలోనూ ప్రత్యేక ప్రీమియర్లు ప్రదర్శించే అవకాశం ఉంది.