వారణాశి మహేందర్ రెడ్డి అలియాస్ మహి వి రాఘవ వ్యవహారంలో చాలా మంది రెండు ఎకరాలే కదా అదే రామోజీరావుకు వందల ఎకరాలు స్టూడియో కోసం ఇచ్చారని ఎదురుదాడి చేస్తున్నారు. వీరందరికీ తెలిసినా.. తెలియనట్లుగా నటించే విషయం ఏమిటంటే… రామోజీ రావు తన జీవితంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వం నుంచి కూడా భూమి తీసుకోలేదు. రామోజీ ఫిల్మ్ సిటీ భూమి కూడా ఆయన పూర్తిగా వ్యక్తుల వద్ద కొనుగోలు చేసిన ప్రైవేటు ల్యాండ్ మాత్రమే. ప్రభుత్వం భూసేకరణ చేయడం లేదా.. ఆ భూమిని రామోజీరావుకు కేటాయించడం వంటి పనులు చేయలేదు. ఆయన ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉంటారు.
హైదరాబాద్ లో ఉన్న ఇతర స్టూడియోలకు ప్రభుత్వమే స్థలాలు కేటాయించింది. కానీ రామోజీ ఫిల్మ్ సిటీకి కాదు. చాలా మంది స్టూడియోలు కడతామని స్థలాలు కావాలని ప్రభుత్వాల వద్దకు వెళ్తూంటారు. విశాలోని రామానాయుడు స్టూడియోకు వైఎస్ భూమి ఇచ్చారు. దాన్ని జగన్ రెడ్డి సగం కొట్టేయబోయారు. ఇలాంటివి చాలా ఉంటాయి.కానీ రామోజీరావు ఏ వ్యాపారం చేసినా… ఆయన ప్రభుత్వం నుంచి ఫలానా ప్రయోజనం కావాలని అడగరు. అది ఏ ప్రభుత్వమైనా సరే. తన వద్ద ఉంటే వ్యాపారం చేస్తారు లేకపోతే లేదు.
రామోజీ ఫిల్మ్ సిటీ స్థలాలను కొనుగోలు చేయడానికి ఆయన ఎంత ఇబ్బంది పడ్డారో.. దాన్ని ఓ ప్రపంచ స్థాయి స్టూడియోగా తీర్చి దిద్ది వేల మందికి ఉపాధి కల్పించడమే కాదు.. కేంద్ర, రాష్ట్రాలకు అత్యధిక పన్నులు కట్టడంలో ఎలా ముందు ఉన్నారో అందరికీ తెలుసు. రామోజీ ఫిల్మ్ సిటీ విషయంలో ప్రభుత్వ క్రెడిట్ జీరో మాత్రమే. అందులో ఒక్క ఎకరం భూకేటాయింపులు ఉన్నా.. వైరాజశేఖర్ రెడ్డి ఊరుకునేవారు కాదు. కానీ ఆయన కొనుగోలు చేసిన భూముల రికార్డులు ట్యాంపర్ చేసి.. వాటిలో అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయని రచ్చ చేశారు. చివరికి వైఎస్ చేసింది తప్పని తేలింది.