నల్లగొండలో కేసీఆర్ సభ పెట్టారు. తాను బీఆర్ఎస్ లీడర్ని కాదని.. టీఆర్ఎస్ లీడర్ని అన్నట్లుగా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు. ఉద్యమం సమయంలో ఆంధ్రోళ్లను తిట్టి.. మాటలతోనే నిప్పు రాజేసినట్లుగా చేసేందుకు ఇప్పుడూ ప్రయత్నించారు. ఎన్ని గుండెలురా మీకు అన్న డైలాగ్ నుంచి.. చాలా చాలా చెప్పారు. తెలంగాణ కోసం తన ప్రాణం అడ్డేస్తానన్నారు. రేవంత్ రెడ్డిని ఇంకా ఎక్కువగా తిట్టారు. అయితే కేసీఆర్ తాను అనుకున్న సెంటిమెంట్ ను రెచ్చగొట్టగలిగారా అన్నది మాత్రం.. బీఆర్ఎస్ నేతలకే అంత నమ్మకం కలగడం లేదు.
పదేళ్లపాటు అప్రతిహతంగా అధికారాన్ని చెలాయించిన తెలంగాణ పార్టీ, బీఆర్ఎస్ కు మొన్నటి ఎన్నికల్లో తగిలిన షాక్తో ఉక్కిరి బిక్కిరవుతోంది. వెంటనే లోక్ సభ ఎన్నికలు మీదపడిపోతున్నాయి. చివరికి KRMB ప్రాజెక్టుల అంశాన్ని సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకు వాడుకోవాలని నిర్ణయించుకున్నారు. ఏదో అయిపోతోందన్న అభిప్రాయం కల్పించేందుకు కేసీఆర్ తన శక్తివంచన లేకుండా ప్రయత్నం చేశారు. కానీ రాజకీయాలు మారిపోయాయి. కేసీఆర్ రెచ్చగొడితే రెచ్చిపోదామని అనుకునేవారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది.
కొత్త ప్రభుత్వం వచ్చిన రోజుల వ్యవధిలోనే జలజగడం హీటెక్కింది. నీళ్లు నిప్పులై మండుతున్నాయి. ప్రజల్లో మళ్లీ పరపతి పెరగాలంటే సెంటిమెంటే ముఖ్యమనుకున్న కేసీఆర్ .. టీఆర్ఎస్ తరహాలో విజృంభించేందుకు సిద్ధమవుతోంది. ఆల్రెడీ దెబ్బతిన్న పార్టీని రెక్కలు విరచాలంటే.. వారి ఆయువుపట్టుపై కొట్టాలన్నట్లుగా రేవంత్ జోరు కనిపిస్తోంది. అందుకు కాళేశ్వరం కృంగిపోవడం కలిసొచ్చింది. ఇప్పుడు రేవంత్ బ్యాటింగ్ నడుస్తోంది. సిక్సర్లు కొడుతున్నారు. ఆంధ్రోళ్లపై తెలంగాణ వాళ్లను రెచ్చగొట్టినట్లుగా ఇప్పుడు రేవంత్ పై .. సొంత జనాల్ని రెచ్చగొట్టగలరా అన్నది సందేహం. అలా చేయగలిగితే సక్సెస్అయినట్లే.