హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తామంటూ వైసీపీ దిగ్గజాలు కొత్త వాదన వినిపిస్తున్నాయి. ఐదేళ్లుగా ఏపీలో పాలన చేస్తున్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. మరి ఈ ఉమ్మడి రాజధానిలో ఐదేళ్లుగా తమకు ఉన్న ఏ హక్కులను అనుభవించారు.. ఏ హక్కులను సాధించారు.. పోనీ ఐదేళ్లలో ఎప్పుడైనా హైదరాబద్ ఉమ్మడి రాజధాని అనే విషయాన్ని గుర్తించారా ? అంటే.. లేనే లేదని చెప్పుకోవాలి.,
కరోనా సమయంలో ఏపీ నుంచి అంబులెన్స్ లు హైదరాబాద్ వెళ్తూంటే కనీస మానవత్వం లేకుండా కేసీఆర్ నిలిపి వేయించారు. మా ఉమ్మడి రాజధానికి మేము వెళ్తూంటే.. అడ్డుకోవడానికి మీరెవరు అని.. ఒక్కరంటే ఒక్క వైసీపీ నేత ప్రశ్నించలేదు. సీఎం జగన్ రెడ్డి చిద్విలాసంగా… కేసీఆర్ తో రాజకీయ ముచ్చట్లు పెట్టుకున్నారు కానీ.. మా ఉమ్మడి రాజధానిలోకి అంబులెన్స్ లు పంపకుండా ఆపుతారా అని అడగలేదు. చివరికి కోర్టులోనూ ఆ వాదన వినిపించలేదు. అది ఒక్కటే కాదు.. అలాంటివి ఎన్నో జరిగాయి. కానీ ఏనాడు తమ రాష్ట్రానికి కూడా హైదరాబాద్ రాజధాని అని గుర్తుంచుకోలేదు.
ఇప్పుడు ఎన్నికలకు ముందు .. ఉమ్మడి రాజధాని గడువు పూర్తయ్యే ముందు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటూ డిమాండ్ చేస్తామని బయలుదేరారు. ఒక వేళ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగిస్తే ఏం చేస్తారు ?. అక్కడ్నుంచి ఏపీ ప్రభుత్వం ఏం పాలన చేస్తోంది ?. ఏ వ్యవహారాలు చక్క బెట్టాలనుకుంటోంది ?. గత ఐదేళ్లుగా జీరో. ఉన్న భవనాలను ఇచ్చేశారు. మరి ఇంకేందుకు ఉమ్మడి రాజధానిగా కొనసాగింపు… తప్పుడు రాజకీయాల కోసం తప్పిదే !