కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్తున్నారు. రాజస్థాన్ నుంచి ఆమె రాజ్యసభ నామినేషన్ వేస్తున్నారు. బలం ఉన్నందున ఆమె ఎన్నికల లాంఛనమే. అంటే ఇక రాయ్ బరేలీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయరన్నమాట. ఇప్పటికే అమేధీలో గత ఎన్నికల్లో రాహుల్ ఓడిపోయారు. ఆయన సేఫ్ గా రెండో చోట కేరళలోని వయనాడ్ ఎంచుకుని గెలిచారు. ఇప్పుడు మరోసారి ఆయన అమేథీ నుంచి పోటీ చేసే అవకాశం లేదు. ఇప్పుడు రాయ్ బరేలీ నుంచి సోనియా పోటీ చేయరు.
ప్రియాంకా గాంధీ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. రాయ్ బరేలీ నియోజకవర్గం దశాబ్దాలుగా కాంగ్రెస్ కంచుకోట. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఫిరోజ్ గాంధీ ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 1977లో ఒక్క సారే జనతా పార్టీ అభ్యర్థి గెలిచారు. రాజీవ్ హత్య తర్వాత ఎవరూ గాంధీ లకుటుంబసభ్యులు పోటీ చేయకపోవడంతో రెండు సార్లు బీజేపీ గెలిచింది. 1999 నుంచి అక్కడ కాంగ్రెస్ గెలుస్తూనే ఉంది. గత ఐదు లోక్ సభ ఎన్నికల్లో సోనియా గాంధీ గెలిచారు.
యూపీలో ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి రాను రాను తీసికట్టుగా మారుతోంది. ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. .. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు సమాజ్ వాదీ .. ఒకటి బీజేపీ గెల్చుకున్నాయి. అయితే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే సరికి ప్రజలు సోనియాకే ఓటు వేసేవారు. ఈ సారి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. అదే సమయంలో సోనియా అనారోగ్యానికి గురయ్యారు. ఆమె ప్రత్యక్ష రాజకీయాల నుంచి దాదాపుగా వైదొలిగారు. అందుకే రాజ్యసభకు వెళ్తున్నారు.