ఆర్.నారాయణమూర్తిది డిఫరెంట్ పంధా. దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా అన్నింటికంటే ముఖ్యంగా వ్యక్తిగా ముందు నుంచీ ఆయన స్టైల్ పూర్తిగా విభిన్నం. డబ్బు యావ లేని మనిషి. గతంలో ‘టెంపర్’ సినిమా కోసం ఓ కీలకమైన పాత్ర కోసం నారాయణమూర్తిని సంప్రదిస్తే సున్నితంగా ‘నో’ చెప్పారు. ఇప్పుడు రామ్ చరణ్ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది.
రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఇందులో ఓ కీలకమైన పాత్రకు నారాయణమూర్తి అయితే బాగుంటుందని టీమ్ భావించింది. మైత్రీ మూవీస్, చరణ్ సినిమా.. నారాయణమూర్తి ‘నో’ ఎందుకు చెప్తారు? కానీ.. మూర్తి మాత్రం సింపుల్ గా ‘సారీ’ చెప్పేసినట్టు తెలుస్తోంది. ఎన్నిరకాలుగా ప్రయత్నించినా నారాయణమూర్తి ఈ సినిమాలో నటించడానికి అంగీకరించలేదని టాక్. దాంతో… చిత్రబృందం ఈ స్థానంలో మరో నటుడ్ని ఎంచుకొనే పనిలో పడింది. ఇదో స్పోర్ట్స్ డ్రామా. ఇందులో కథానాయికగా జాన్వీ కపూర్ ఎంపిక దాదాపుగా ఖాయమైంది. ఓ పాత్ర కోసం కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ని తీసుకొన్నారు. మరికొన్ని ముఖ్యమైన పాత్రల్లో ప్రముఖ నటీనటుల ఎంపిక కోసం కసరత్తు జరుగుతోంది.