ఏపీ రాజధాని అంశంపై మరో వైసీపీ సీనియర్ నేత భిన్నమైన ప్రకటన చేశారు. ఏపీకి రాజధాని కట్టుకునే ఆర్థిక స్థోమత లేనందున హైదరాబాద్ నే ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఈ అంశంపై కేంద్రంతో మాట్లాడతామని.. రాజ్యసభలో కూడా ప్రస్తాిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. పరువు పోతోందని బీఆర్ఎస్ నేతలు కూడా తిడుతున్నారని వెంటనే మరో సీనియర్ నేత బొత్సను రంగంలోకి దింపార. వైవీ సుబ్బారెడ్డి అలా అనలేదని బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు.
ఆయన మాటలను వక్రీకరించారని.. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించడం సాధ్యం కాదని చెప్పుకొచ్చారు. పదేళ్ల తర్వాత ఉమ్మడి రాజదాని కొనసాగింపు సాధ్యం కాదని.. అనుభవం ఉన్న నేత ఎవరూ అలా మాట్లాడరని చెప్పుకొచ్చారు. రాజధాని విషయంలో మా పార్టీ విధానం ఎప్పుడూ చెప్పాం. దానికి మేము కట్టుబడి ఉన్నాము. అలాగే.. హైదరాబాద్ విశ్వనగరం.. అక్కడ ఎవరికైనా ఆస్తులు ఉండొచ్చు. అదేం ప్రశాంత్‌రెడ్డి ఆస్తి కాదని చెప్పుకొచ్చారు. ఉమ్మడి రాజధాని అంశం రాజకీయాల్లో సంచలనం సృష్టించడం.. బీఆర్ఎస్ తో పాటు టీడీపీ, బీజేపీ నేతలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో వైసీపీ హైకమాండ్ .. వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగినట్లుగా తెలుస్తోంది.
అయితే వైవీ సుబ్బారెడ్డితో ఖండన ప్రకటన విడుదల చేయకుండా.. బొత్స సత్యనారాయణతో.. మాటల్ని వక్రీకరించారని చెప్పించడం కూడా వ్యూహంలో భాగమేనని భావిస్తున్నారు. మొత్తంగా .. వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలతో … ఏపీలో రాజధాని అంశం మరోసారి హాట్ టాపిక్ అవుతోంది.