అమెరికా అధ్యక్ష ఎన్నికలలో దూసుకుపోతున్న రిపబ్లికన్ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ ఆదివారంనాడు “ఫేస్ ద నేషన్” అనే టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ “ఐసిస్ ఉగ్రవాదులతో మనం ఇంకా చాలా దృడంగా, కటినంగా వ్యవహరించవలసి ఉంది. వారికి ఎటువంటి నియమనిబంధనలు లేవు, ఉన్నా పాటించరు. కానీ మనకు మాత్రం వారితో ఏవిధంగా వ్యవహరించాలనే దానిపై చాలా నియమనిబంధనలున్నాయి. ఆ కారణంగా వారు మన కంటే అపరిమితమయిన శక్తివంతులుగా నిలుస్తున్నారు. వారితో పోలిస్తే మనం చాలా బలహీనంగా ఉన్నామని చెప్పకతప్పదు. నేను అధికారంలోకి వస్తే మనం కూడా వారికి ధీటుగా జవాబు చెప్పగలిగే విధంగా చట్ట సవరణలు చేస్తాను. ప్రస్తుతం మనం అనుసరిస్తున్న లోపభూయిష్టమయిన కొన్ని విధానాల వలన బందీలుగా చిక్కిన ఉగ్రవాదుల నుండి సమాధానాలు రాబట్టడం చాలా కష్టంగా ఉంటోంది. నేను అధికారంలోకి వస్తే వారిని ఇంటరాగేషన్ చేసేందుకు పోలీస్, నిఘా అధికారులకు అవరోధంగా ఉన్న నియమనిబంధనలను తొలగిస్తాను. ఐసిస్ ఉగ్రవాదులకి చిక్కిన మన బందీల పట్ల వారు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో అందరికీ తెలుసు. కనుక మనం కూడా వారి పట్ల అదే విధంగా వ్యవహరించినపుడే వారిని అదుపు చేయడం సాధ్యం అవుతుంది,” అని ట్రంప్ అన్నారు.
“మనం కూడా వారిలాగే క్రూరంగా ప్రవర్తించడం సబబేనా?” అని ఆ టీవీ కార్యక్రమ ఏంకర్ జాన్ డికర్ సన్ అడిగినప్పుడు ‘సబబే’నని ట్రంప్ చెప్పడం విశేషం. “వారికి ఎటువంటి నియమనిబంధనలు లేనప్పుడు మనం మాత్రం వాటికి ఎందుకు కట్టుబడి ఉండాలి?” అని ట్రంప్ ప్రశ్నించారు.
బందీలుగా చిక్కిన ఐసిస్ ఉగ్రవాదులు లేదా వారికి సహకరించిన సానుభూతిపరులను చిత్ర హింసలకు గురిచేసి వారి నుండి నిజాలు, రహస్యాలు రాబట్టాలనే ట్రంప్ ఆలోచనని అమెరికాలోని 100 మంది విదేశీ వ్యవహారాల నిపుణులు తప్పు పడుతూ ఆయనకి ఒక బహిరంగ లేఖ వ్రాసారు. దానిని ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు.
తను అమెరికా అధ్యక్షుడయితే ఐసిస్ ఉగ్రవాదుల స్థావరాలపై మామూలు బాంబులు కాక న్యూక్లియర్ బాంబులను ప్రయోగిస్తానని ట్రంప్ ఇదివరకు ఒకసారి చెప్పారు. అంతే కాదు ఐసిస్ ఉగ్రవాదులనే కాకుండా వారి భార్యా పిల్లలను కూడా చంపుతానని చెప్పారు. ఆయన చెపుతున్న ఇటువంటి మాటలు ఐసిస్ ఉగ్రవాదులను మరింత రెచ్చగొట్టేందుకే ఉపయోగపడతాయి తప్ప వారిని ఏమాత్రం భయపెట్టలేవని అందరికీ తెలుసు.