తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సెక్రటేరియట్ లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని నిర్ణయించుకున్నారు. నిర్ణయం తీసుకుని వెంటనే శంకుస్థాపన కూడా చేసేశారు. ఒక పక్క అంబేద్కర్, మరోపక్క ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు, జైపాల్ రెడ్డి గారి విగ్రహాలు ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఉన్నాయని.. ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం లేని లోటు స్పష్టంగా కనిపించిందని రేవంత్ రెడ్డి శంకుస్థాపన సందర్భంగా అన్నారు. టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పు తెచ్చిన మహా నేత రాజీవ్ గాంధీ.. దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని గుర్తు చేసుకున్నారు.
రేవంత్ నిర్ణయంపై బీఆర్ఎస్ మండిపడింది. సెక్రటేరియట్లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనే నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయనకు తెలంగాణకు ఏం సంబంధం అన్నారు. అక్కడ కేసీఆర్ హయాంలో ప్రతిపాదించిన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని అంటున్నారు. నిజానికి అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని బీఆర్ఎస్ అనుకోలేదు. అలాంటి ప్రతిపాదన ఉంటే.. ఎప్పుడో చేసి ఉండే వారు కూడా. అక్కడ ఏ విగ్రహం పెట్టాలనుకున్నారో కానీ.. రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారనే సరికి మాత్రం వారికి కోపం వచ్చింది.
అయితే సెక్రటేరియట్ నిర్మాణం చివరి దశకు వచ్చినప్పుడు తెలుగు తల్లి ఫ్రైఓవర్ దగ్గర ఉండాల్సిన తెలుగు తల్లి విగ్రహాన్ని రాత్రికి రాత్రి తీసేశారు. రోడ్డును మార్చడానికి చేశారు. ఆ విగ్రహం ఎక్కడ పెట్టారో కూడా తెలియదు. ఎక్కడైనా పెట్టాలనుకున్నారో కూడా తెలియదు. మర్చిపోయారు. తెలుగు తల్లి విగ్రహాం ఆనవాళ్లు లేకుండా చేయాలనుకున్న కేసీఆర్.. ఇప్పుడు తాను ఎంతో ఇష్టపడి కట్టించిన సెక్రటేరియట్ లో రాజీవ్ గాంధీ విగ్రహం కొలువవుతూండటం చూసి ఎంత బాధపడతారో అంచనా వేయడం కష్టమేనని కాంగ్రెస్ వర్గాలు సెటైర్లు వేస్తున్నాయి.