రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ పెడుతుందా లేదా అన్నదానిపై స్పష్టత వచ్చింది. అభ్యర్థిని నిలబెట్టే ఆలోచన లేదని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు తెలిపారు. టీడీపీ అభ్యర్థిని నిలబెడితే గట్టి పోటీ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. టిక్కెట్ దక్కని వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేస్తారని అనుకుంటున్నారు. అందుకే వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఎమ్మెల్యేలకు బంపర్ ఆఫర్లు ఇస్తున్నారని అంటున్నారు. కానీ టీడీపీ పోటీ పెట్టకపోవడంతో వైసీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది.
వైసీపీ కీలక నేతలు టచ్ లోకి వస్తున్నారని.. అయితే పార్టీలో చేర్చుకునే విషయంలో ఎలాంటి హామీ ఇవ్వడం లేదని చంద్రబాబు పార్టీ నేతలకు చెబుతున్నారు. వైసీపీ నుంచి వచ్చిన అందరినీ తీసుకోలేము .. అన్నీ ఆలోచించే నిర్ణయాలు ఉంటాయని అంటున్నారు. పొత్తులు, చేరికల వల్ల పార్టీలో కష్టపడిన నేతలకు నష్టం జరగకూడదన్నారు. కష్టపడిన నేతల భవిష్యత్తుకు నష్టం జరగకుండా చూడడానికే ప్రాధాన్యం ఇస్తామని భరోసా ఇచ్చారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి ముగ్గురు ఎంపీలు.. పలువురు ఎమ్మెల్యేలు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. పలువురు చంద్రబాబుతో కూడా భేటీ అయ్యారని.. ఫలానా సీట్లు ఖరారరయ్యాని చెబుతున్నారు. ఈ అంశాలపై మరికొంత మంది నేతలు పార్టీ అధినేతతో చర్చించేందుకు వస్తున్నారు.
ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నందున అందరూ .. ఎన్నికల మూడ్ లోకి రావాలని పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే జిల్లాల వారీగా ఖరారైన పార్టీ అభ్యర్థులకు అనధికారిక సమాచారం ఇచ్చారు. వారు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పొత్తుల వల్ల కొన్ని నియోజకవర్గాలపై స్పష్టత లేదు. వాటి విషయంలో మాత్రం సందిగ్ధత ఉంది. బీజేపీతో పొత్తుల చర్చలు ఓ కొలిక్కి రావాల్సి ఉంది. ఈ కారణంగానే పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల ఆలస్యమవుతోందని అంచనా వేస్తున్నారు. మరో వారంలో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.