ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో వైసిపి సమన్వయకర్తల నియామకం పార్టీలో తీవ్ర గందరగోళానికి దారితీసింది. మొదటి విడత జాబితాలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్థానంలో నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించిన గంజి చిరంజీవి పరిస్థితి ప్రస్తుతం డోలాయనంలో పడింది. చిరంజీవి అభ్యర్థిత్వంపై సర్వే చేసిన ఐ ప్యాక్ బృందాలు ప్రతికూల పవనాలే ఎక్కువగా ఉన్నాయని నివేదికలిచ్చాయి. చిరంజీవి స్థానంలో మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూమార్తె, ఎమ్మెల్సీ హనుమంతరావు కోడలు లావణ్య పేరును అధిష్టానం పరిశీలిస్తోంది.
ప్రత్తిపాడులోనూ అసమ్మతి ప్రారంభమైంది. ప్రస్తుత సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్‌కు కాకుండా మాల వర్గానికి కేటాయించాలని డిమాండ్ వినిపిస్తోంది. కిరణ్‌కుమార్ స్థానికేతరుడుగా ప్రచారమవుతుండడంతో ఆయన్ను మార్చాలా? కొనసాగించాలా? అనే అంశంపై వైసిపి అధిష్టానం తర్జనభర్జన పడుతోంది. రేపల్లెలో సమన్వయకర్త ఈపూరి గణేష్ అభ్యర్థిత్వంపైనా సానుకూలత రావడంలేదని సర్వేల్లో వెల్లడయింది. మోపిదేవి సహకరించడం లేదన్న అనుమానంతో ఆయన చెప్పిన వారికే అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో సిఎం జగన్ ఉన్నారు.
పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు టిక్కెట్ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. గుంటూరు లోక్‌సభకు రోశయ్య బావమరిది ఉమ్మారెడ్డి వెంకట రమణకు ఖరారు చేయడంతో రోశయ్య అభ్యర్థిత్వం పెండింగ్‌లో పడింది ఎవరిని పొన్నూరు వెళ్లమన్నా మాకొద్దు బాబోరు అంటున్నారని పార్టీలో ప్రచారం ఉంది. రెండేళ్లుగా వైసిపికి జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న ఆళ్ల అయోధ్య రామిరెడ్డిని కూడా ఇటీవల తప్పించారు. ఎంపి విజయసాయిరెడ్డికి గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం బాధ్యతలు అప్పగించారు.
పల్నాడు జిల్లాలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అసమ్మతి బావుటా ఎగుర వేశారు. సత్తెనపల్లిలో కూడా మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా అసమ్మతి రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. అంబటికి టిక్కెట్ కొనసాగింపుపై పార్టీలో ఇంకా సందిగ్ధం ఉంది. చిలకలూరిపేటలో మంత్రి విడదల రజిని స్థానంలో సమన్వయకర్తగా నియమితులైన మల్లెల రాజేష్ నాయుడు అభ్యర్థిత్వంపై కూడా ఐప్యాక్ సర్వే చేస్తోంది. అక్కడా మార్పు ఖాయమని అంటున్నారు.