కొత్తగా రాయకపోతే పదాలెలా పుడతాయి? అనేది పింగళివారి మాట. అసమదీయులు, తసమదీయులు అలాంటి గొప్ప పద ప్రయోగాలు చేసిన ఘనత ఆయనది. తెలుగు భాషకు సరికొత్త వన్నెలద్దిన ఘనత ఆయనది. పింగళికి ముందు చాలామంది రచయితలు వచ్చాయి. పింగళి తరవాత కూడా చాలామంది పుట్టారు. కానీ ఆయన స్థానాన్ని ఇప్పటి వరకూ ఎవరూ భర్తీ చేయలేకపోయారు. కనీసం దరిదాపుల్లోక్కూడా వెళ్లలేదు. ఇప్పుడు ఈ పింగళివారి ఘన కీర్తి గుర్తు చేసుకోవడానికి ఓ కారణం ఉంది. అది… `హరోం హర`లోని ఓ పాట.
సుధీర్‌బాబు కథానాయకుడిగా నటించిన `హరోం హర` చిత్రం నుంచి టైటిల్ ట్రాక్ విడుదలైంది. కల్యాణ చక్రవర్తి త్రిపురనేని ఈ పాట రాశారు. పాటలో చాలా మంచి భావాలున్నాయి. వాటి మధ్యలో `అలమలం` అనే పదం మెరిసింది.
”నువు తాకిన అనువు అలమలం.. నువు కదిపిన అడుగు కలకలం” అంటూ చరణం సాగింది. ఇక్కడ అలమలం అంటే అర్థం చాలామందికి తెలీలేదు. ఇది నిజానికి కల్యాణ చక్రవర్తి పుట్టించిన పదం కాదు. పింగళివారి సృష్టి. ‘మాయాబజార్’లో పింగళి ఈ పద ప్రయోగం చేశారు. ‘అలమలం’ అంటే శుభం అని అర్థం. మాయాజజార్లో ఏఎన్నార్ ఎదురైనప్పుడు సూర్యకాంతం ‘అలమలం బిడ్డా.. అలమలం’ అంటారు. అక్కడ అలమలం అంటే ‘శుభం జరుగుగాక’ అని అర్థం ఉంది. ఆ పదాన్ని ఇక్కడ వాడారన్నమాట.
ఈ పాట గురించి, ఈ పద ప్రయోగం గురించి రచయిత కల్యాణ చక్రవర్తి తెలుగు 360తో మాట్లాడుతూ ”పింగళిగారంటే నాకు చాలా గౌరవం. మాయాబజార్లో ఆయన చేసిన ఈ పద ప్రయోగం నన్నెంతో ఆకర్షించింది. ఆ పదాన్ని ఎక్కడైనా వాడాలి.. ఈ తరానికి గుర్తు చేయాలి అని చాలాసార్లు అనుకొన్నా. ఆ సందర్భం ఈ పాటతో వచ్చింది. ఈ పాట.. పింగళివారికి నాలాంటి అభిమాని ఇచ్చే నివాళి, కానుక..” అన్నారు. ఎవరో ఒకరు పుట్టించకపోతే కొత్త పదాలు పుట్టవు. అలా పుట్టిన పదాల్ని ఎవరో ఒకరు ఇలా గుర్తు చేయకపోతే వాటి మనుగడ ఉండదు. ఈ విషయంలో.. ఈ కుర్ర రచయితని అభినందించాల్సిందే.