ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. వేళ వైకాపా ప్రభుత్వానికి ఒణుకు ఎక్కువవుతోంది. విమర్శల దాడిని తట్టుకోలేకపోతోంది. ఎవరు గొంతెత్తినా అణగదొక్కాలని చూస్తోంది. ఆఖరికి ఓ చిన్న సినిమాకూ దడదడలాడిపోయింది. ఈరోజు ‘రాజధాని ఫైల్స్’ అనే ఓ సినిమా విడుదలైంది. అమరావతి రైతుల ఆక్రందన చుట్టూ నడిచిన కథ ఇది. వైకాపా ప్రభుత్వ పని తీరుని ఎండగట్టే సన్నివేశాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయి. పరదాల ముఖ్యమంత్రి, గొడ్డలి వేటు సన్నివేశాల్ని చూడ్డానికి చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకే ‘రాజధాని ఫైల్స్’పై ప్రభుత్వం కక్ష కట్టింది. ఈ సినిమాని అర్థాంతరంగా నిలిపివేస్తూ… హడావుడి సృష్టించింది.
విజయవాడలోని ట్రెండ్ సెట్ మాల్ లో ఈ సినిమా నడుస్తున్న సమయంలో సడన్గా అధికారులు రంగ ప్రవేశం చేసి ప్రదర్శనను అడ్డుకొన్నారు. గుంటూరులోని పలు ధియేటర్లలోనూ ఇలాంటి ఘటనలే చోటు చేసుకొన్నాయి. సినిమా చూడ్డానికి వచ్చిన ప్రేక్షకులు ‘మనకెందుకులే..’ అని వెళ్లిపోలేదు. ‘ఈ సినిమాని ఎందుకు అడ్డుకొంటున్నారు? కోర్టు ఆర్డరు కాపీలు ఏమైనా ఉన్నాయా’ అంటూ అధికారుల్ని నిలదీశారు. ‘రాజధారి ఫైల్స్’ చిత్రాన్ని అడ్డుకోవడం పట్ల టీడీపీ శ్రేణులతో పాటుగా, అమరావతి రైతు సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఓ సినిమా చూసి ఇంతగా ఒణికిపోతున్న ముఖ్యమంత్రి ఈ చరిత్రలోనే కనిపించడంటూ జగన్పై విరుచుకుపడుతున్నారంతా. తమ ప్రభుత్వంలోని డొల్లతనాన్ని ఎండగట్టిన సినిమాని అడ్డుకొన్న ఆ చేత్తోనే రాంగోపాల్ వర్మ తీసిన ‘వ్యూహం’ సినిమా ఆడుతున్న థియేటర్ల ముందు నిలబడి మరీ… టికెట్లు పంచిపెడతారు. వైకాపా లీలల గురించి తెలియనిదేముంది..?