కాంగ్రెస్ పార్టీ కోసం రేవంత్ రెడ్డి కూడా బరిలోకి దిగుతున్నారు. ఇరవై ఐదో తేదీన తిరుపతిలో బహిరంగసభ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అదే సభలో కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఈ సభకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా వచ్చే అవకాశం ఉంది. ఏపీలో పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత షర్మిల రెండుసార్లు విస్తృతంగా పర్యటించారు. అయితే ముఖ్యమైన నాయకులతో ఓ బహిరంగసభను ఇంకా ప్లాన్ చేసుకోలేదు.
షర్మిల తన కుమారుడి వివాహా పనుల్లో బిజీగా ఉన్నారు. పదిహేడో తేదీన వివాహం పూర్తవుతుంది. పద్దెనిమిదో తేదీన కూడా రిసెప్షన్ ఉంటుంది. అందుకే ఇరవై ఐదో తేదీన బహిరంగసభ ఏర్పాటు చేశారు. తిరుపతిలో భారీగా జన సమీకరణ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల షర్మిల రేవంత్ రెడ్డిని కలిసి.. ఏపీ రాజకీయాలపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఏం చేయాలన్నదానిపై మాట్లాడారు. బహిరంగసభలకు తాను హాజరవుతానని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
రేవంత్ రెడ్డికి ఏపీలోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన బహిరంగసభకు వస్తారంటే.. జనం పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి పేరును ఉపయోగిచుకుని.. రెడ్డి వర్గాన్ని , దళిత, మైనార్టీలను కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షించాలని గట్టి ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నారు. తిరుపతి సభ కు మంచి ఆదరణ లభిస్తే.. తర్వాత రేవంత్ రెడ్డి తో వరుస సభలు నిర్వహించే ఆలోచనలో ఏపీ పీసీసీ వర్గాలున్నాయి.