గత నెల రోజులుగా టీడీపీ కార్యాలయం, చంద్రబాబు ఇంటి వద్ద ఎప్పుడూ కోలాహలం కనిపిస్తూనే ఉంది. చంద్రబాబు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన సమక్షంలో పార్టీలో చేరడానికి నేతలు వస్తూనే ఉన్నారు. గురువారం పార్టీ నేతల్ని కలవడానికి చంద్రబాబు సమయం ఇవ్వడంతో మధ్యాహ్నం నుంచి ఉండవల్లిలోని ఆయన నివాసం దగ్గర జన జాతర కనిపించింది. పలు నియోజకవర్గాల నుంచి నేతలు ఆయనను కలిసి పార్టీలో చేరేందుకు వచ్చారు. నాలుగేళ్ల తర్వాత ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఇలాంటి కోలాహలం కనిపిస్తోంది. టీడీపీ ఆఫీసులోనూ చేరికలు జోరుగా సాగుతున్నాయి.
వైసీపీలోని ద్వితీయ శ్రేణి నాయకత్వం పెద్ద ఎత్తున పార్టీ మారుతున్నారు. బాలినేనికి అత్యంత సన్నిహితుడు అయిన అట్ల చినవెంకటరెడ్డి అనే పర్చూరు నేత కూడా టీడీపీలో చేరిపోయారు. కీలక నేతలకు అనుచరులుగా ఉండి.. ఏకగ్రీవంగా ఎన్నికైన జడ్పీటీసీలు కూడా టీడీపీలో చేరుతున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో మూడు మండలాల జడ్పీటీసీలు టీడీపీలో చేరిపోయారు. కొన్ని వంద మంది వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం టీడీపీ వైపు చూస్తోంది.
నిజానికి చంద్రబాబు ఇంకా చేరికల మిషన్ ప్రారంభించలేదు. చాలా మంది పార్టీ లో పని చేసుకోవడం ప్రారంభించారు కానీ ఇంకా కండువాలు కప్పలేదు. ప్రస్తుతం పొత్తులు, సీట్ల సర్దుబాటులో చాలా బిజీగ ా ఉన్నారు. తర్వాత చేరికల కార్యక్రమాలను పెట్టుకోనున్నారు. టిక్కెట్లు ఖరారు చేయకపోయినా చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలైన చేరిక జాతర ముందు ముందు ఉంటుందని టీడీపీ వర్గాలంటున్నాయి. మరో వైపు వైసీపీ కార్యాలయం వద్ద ఎలాంటి సందడి ఉండటం లేదు.