రామ్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ కమర్షియల్ గా భారీ విజయాన్ని నమోదు చేసింది. రామ్ కెరీర్లో అత్యధిక వసూళ్లని అందించిన సినిమాగా నిలిచింది. అందుకే ఈ చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మార్చి 8న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని పూరి సినిమాకి కొబ్బరికాయ కొట్టేముందే ప్రకటించారు. అయితే… పూరి లెక్క తప్పింది. అనుకొన్న సమయానికి ఈ సినిమా సిద్ధం కాలేదు. ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకొన్నాడు పూరి. జూన్ 14న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆర్థిక సమస్యలతో ఈ సినిమా ఆగిపోయిందని, నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్మకాలు లేక సినిమా ముందుకు సాగడం లేదన్న వార్తలొచ్చాయి. అయితే చిత్రబృందం ఇవేం పట్టించుకోవడం లేదు. మిగిలిన షూటింగ్ కి ఏప్రిల్ నాటికి పూర్తి చేసి, మే కల్లా ఫస్ట్ కాపీ రెడీ చేయాలని పూరి భావిస్తున్నారు. మణిశర్మ కూడా ఇప్పటికే ట్యూన్స్ రెడీ చేసేశారు. పాటల్ని హైదరాబాద్ లోనే తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్ తో పాటు ఓ ఆసక్తికరమైన అప్ డేట్ ఇవ్వాలని పూరి భావిస్తున్నారు.