అధికార పార్టీ వైసీపీ తరపున పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకని పరిస్థితి కనిపిస్తోందని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు కానీ ఎక్కువ మంది నమ్మడం లేదు. కానీ వైసీపీ నుంచి వచ్చే జాబితాలు చూస్తూంటే.. ఎవరికైనా అది నిజమే అనిపిస్తోంది. రెండు పేర్లతో జగన్ రెడ్డి ఏడో జాబితా విడుదల చేశారు. ఆ రెండింటిలో కొత్త సమన్వయకర్తల్ని నియమించారు. పాత వారు పార్టీలో ఉంటారో లేదో తెలియని పరిస్థితి. అందుకే అప్పటికప్పుడు వెదుక్కుని టీడీపీలో ఉన్న నేతల్ని పిలిచి మరీ సీట్లిచ్చారు. ఈ సీట్లలో అభ్యర్థుల్ని చూసి.. వైసీపీ నేతలు కూడా పరిస్థితి ఇంత ఘోరంగా ఉందా అని ఆశ్చర్యపడుతున్నారు.
పర్చూరుకు సమన్వయకర్తగా నియమించిన యడం బాలాజీ అనే నేత టీడీపీలో ఉన్నారు. ఆయన చాలా రోజులుగా రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. పైగా అమెరికాలో ఉంటున్నారు. పర్చూరులో ఆమంచి హ్యాండిస్తాడని.. టిక్కెట్ ఇచ్చినా సరే చీరాలలో ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తాడన్న ఉద్దేశంతో ఆయనను తప్పించాలని నిర్ణయించుకున్నారు. ఎవరికి సీటివ్వాలో తెలియక ఎడం బాలాజీని ఆమెరికాను పిలిపించారు. జగన్ రెడ్డిని కలిసినట్లుగా ఓ ఫోటో విడుదల చేసి .. ఆయనను సమన్వయక్తగా ప్రకటించారు.
ఇక కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డికీ టిక్కెట్ నిరాకరించారు. ఆయన స్థానంలో వేరే నియోజకవర్గానికి చెందిన పెంచలయ్య అనే టీడీపీ నేత కుమార్తెను ఇంచార్జ్ గా నియమించారు. పెంచలయ్య ఈ నెలలోనే వైసీపీలో చేరారు. ఈ అభ్యర్థిత్వాన్ని చూసి కందుకురూ వైసీపీ నేతలు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. మహీధర్ రెడ్డి… చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను బూతులు తిట్టి లాయల్టీని నిరూపించుకోలేకపోయారు. అందుకే ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. నిజానికి 2019 ఎన్నికల సమయంలో మహీధర్ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు జగన్ రెడ్డి ఎన్ని పాట్లు పండారో నియోజకవర్గంలో అందరికీ తెలుసు. చివరికి తిరుపతి తీసుకెళ్లి పార్టీ మారకూడదని ప్రమాణం కూడా చేయించుకున్నారు. ఇప్పుడు ఆయనను పూచిక పుల్లలా తీసి పడేశారు.