ఎన్నికల సమయం . బీజేపీకి ఊడిగం చేయని బీజేపీయేతర పార్టీల ప్రభుత్వాలు వణికిపోతున్నాయి. కేసుల ఉచ్చులో పడి వణికిపోతున్నారు. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ పరిస్థితి చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఆ పార్టీ బ్యాంక్ ఖాతాల్ని కూడా నిలిపివేశారు. గగ్గోలు రేగడంతో .. డబ్బులున్నా వాడుకోలేని స్థితి కల్పించి… ఊరట కల్పించారు. ఈ ప రిస్థితి ని చూసిన కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ప్రజాస్వామ్యానికి చివరి రోజులు వచ్చేశాయని.. మరోసారి బీజేపీ గెలిస్తే ఇక ఎన్నికలే రావని తేల్చేశారు. మతం మత్తులో కాకుండా కాస్త ఆలోచనతో ఉండేవారందరికీ ఇది నిజమే అనిపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ రూ. 210 కోట్ల ఆదాయపు పన్ను కట్టాలని ఐటీ శాఖ డిమాండ్ నోటీస్ ఇచ్చింది. ఎందుకంటే 2018-19కి సబంధించిన రిటర్న్స్ ను కొన్ని రోజులు ఆలస్యంగా దాఖలు చేసింది. కాంగ్రెస్ ఎంఎల్ఎలు, ఎంపిలు తమ వేతనాల నుంచి విరాళాలుగా పార్టీకి ఇచ్చిన రూ. 14.4 కోట్ల నగదు రసీదులలో లోపాలున్నాయని గుర్తించిన ఐటీ శాఖ ఇప్పుడు డిమాండ్ నోటీసు పంపింది. కాంగ్రెస్ పార్టీ రూ. 210 కోట్ల ఆదాయపు పన్ను కట్టాలని అందులో పేర్కొన్నది. అందుకే ఖాతాలను స్తంభింపచేసింది. తర్వాత అప్పిలేట్ ట్రిబ్యూనల్ ఊరట ఇచ్చింది. కానీ రూ. 115 కోట్లు పరిమితి విధించింది. ఖాతాల్లో ఆ మొత్తం ఉంచి..ఆ పైన ఉన్న నగదును మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది.
రాజ్యాంగ విరుద్దమైన ఎలక్టోరల్ బాండ్లను సుప్రీంకోర్టు కొట్టేసిన తరువాత బీజేపీ ఖాతాలు సీజ్ చేయాల్సి ఉందని కాంగ్రెస్ అంటోంది. ఇందులో 95 శాతానికి పైగా నిధుల్ని బీజేపీ జేబులో వేసుకుందని ఆరోపించారు. ఎలక్టోరల్ బాండ్ స్కాంతో రూ. 6,500 కోట్లు చెక్కు చెదరకుండా ఆ పార్టీ అకౌంట్లో మిగిలిపోయాయని… కాంగ్రెస్ అంటోంది. మొత్తంగా ఎన్నికలకు వెళ్లి ప్రజలతో ఓడించడం కన్నా.. ముందు అధికార బలంతో చితక్కొట్టి.. వారిని మళ్లీ లేవకుండా చేసి ఎన్నికలకు వెళ్లి గెలిచే వ్యూహాన్ని బీజేపీ అవలంభిస్తోంది.