చీరాలలో ఇండిపెండెంట్ గా కూడా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ జగన్ రెడ్డిని నమ్ముకుని రోడ్డు మీద పడ్డారు. గతంలో టీడీపీలో ఉండే ఆయన ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిపోయారు. ఆ పార్టీ తరపు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినా వైసీపీ అధికారంలోకి వచ్చింది కదా అని ఆయన సంతోషంగా ఉండలేకపోయారు. న్యాయవ్యవస్థపై దారుణమైన వ్యాఖ్యలు చేసి జగన్ ను సంతృప్తి పరిచే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. సీబీఐ కేసులో ఇరుక్కున్నారు కానీ ఆయనకు నియోజకవర్గంలో పరపతి లేకుండా చేశారు.
టీడీపీ నుంచి గెలిచిన కరణం బలరాం వైసీపీలో చేరడంతో జగన్ రెడ్డి ఆయనకే ప్రాధాన్యం ఇచ్చారు. నియోజకవర్గంలో జోక్యం చేసుకోవద్నది ఆమంచికి చెప్పి.. .. పర్చూరుకు పంపారు. అక్కడ గెలిచే అవకాశం ఇసుమంత కూడా లేదని తేలిన తర్వాత ఆయన చీరాలపైనే దృష్టిపెట్టారు. వైసీపీ టిక్కెట్ ఇస్తే ఇచ్చింది లేకపోతే లేదు.. తాను మాత్రం చీరాలలోనే పోటీ చేయాలని డిసైడయ్యారు. జనసేన పార్టీలో అయినా చేరి పోటీ చేయాలనుకుంటున్నారు. ఆయన సోదరుడ్ని చాలా రోజుల కిందటే జనసేనలోకి పంపారు.
ఇప్పుడు పర్చూరుకు కూడా ఆయన ఇంచార్జిత్వాన్ని తీసేసిన జగన్.. యడం బాలాజీ అనే నేతకు చాన్సిచ్చారు. ఆమంచి చీరాలలో ఇండిపెండెంట్ గా గెలిచినప్పుడు వైసీపీ అభ్యర్థి ఈయనే. ఇప్పుడు ఆమంచి ఏం చేయబోతున్నారన్నది వైసీపీ వర్గాల్లోనూ ఆసక్తి కరంగా మారింది. ఆయన పార్టీ మారినా.. ఇండిపెండెంట్ గా పోటీ చేసినా వైసీపీకి తీవ్ర నష్టం జరగడం ఖాయంగా కనిపిస్తోంది.