ఒకప్పుడు అల్లరి నరేష్ మినిమం గ్యారెంటీ హీరో. కామెడీ కథలకు కేరాఫ్ అడ్రస్స్. అయితే వరుసగా అలాంటి సినిమాలే చేయడం వల్ల మొనాటినీ వచ్చేసింది. ఫ్లాపులు పడ్డాయి. నరేష్ పనైపోయిందనుకొన్న తరుణంలోనే రూటు మార్చాడు. సీరియస్ కథల్ని ఎంచుకోవడం మొదలెట్టాడు. ‘నాంది’ హిట్టయినా, ఆ తరవాత మళ్లీ ఫ్లాపులు రావడం స్టార్ట్ అయ్యాయి. నరేష్ కామెడీ చేస్తే బాగుంటుందన్న ఫీలింగ్ మళ్లీ వచ్చింది. దాంతో… ఇప్పుడు బ్యాలెన్సింగ్ చేయడం మొదలెట్టాడు. ‘నా సామిరంగ’లో నరేష్ చేసిన అంజి పాత్రకు మంచి పేరొచ్చింది. కామెడీ టచ్ ఉన్నా, చివర్లో ఎమోషన్ గా ముగిసే క్యారెక్టర్ అది. మరోవైపు ‘బచ్చలమల్లి’ అనే ఓ మాస్ సినిమా ఒప్పుకొన్నాడు. 1990 బ్యాక్ డ్రాప్లో సాగే కథ ఇది. నరేష్ గెటప్ కూడా వెరైటీగా ఉండబోతోంది.
దీంతోపాటుగా ‘ఆ ఒక్కటీ అడక్కు’ అంటూ తనదైన కామెడీ ముద్ర పడిన ఓ కథ పట్టాలెక్కించాడు. పెళ్లిమీద ద్వేషం పెంచుకొన్న ఓ కుర్రాడి కథ. తన పెళ్లి ప్రయత్నాల చుట్టూ ఈ కథ నడుస్తుంది. పైగా ఈవీవీ టైటిల్. శుక్రవారం విడుదలైన గ్లింప్స్ నరేష్ స్టైల్లో ఉండి, నవ్విస్తోంది. ఈ రెండూ రెండు రకాల కథలు. ఒకే తరహా పాత్రలకు కట్టుబడకుండా ఎమోషన్, మాస్, కామెడీ… ఇలా తనలోని అన్ని కోణాల్నీ ఆవిష్కరించుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. నరేష్ నుంచి కామెడీ కోరుకొనే వాళ్లని నిరుత్సాహపరచకుండా, తను కోరుకొనే ఎమోషన్ పాత్రల్ని వదలకుండా రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడు. నిజానికి ఇది మంచి ఎత్తుగడ. మోనాటినీకి బ్రేక్ ఇచ్చే ప్రయత్నం. నటుడిగా తనకే కాదు… ప్రేక్షకులకూ రిలీఫే! మొత్తానికి అల్లరోడు లైన్లో పడినట్టే.