ఓ సినిమాని మీడియా ముందుకు, ప్రేక్షకుల్లోకి ఎలా తీసుకెళ్లాలో ఈతరం హీరోలకు బాగా తెలుసు. నాని, విశ్వక్సేన్, విజయ్‌దేవరకొండ లాంటి హీరోలు సినిమాల్ని తమ భుజాలమీద మోసుకెళ్తుంటారు. విపరీతంగా ప్రచారం చేస్తారు. పబ్లిసిటీ విషయంలో రాజీ పడరు. అందుకే… వాళ్ల యావరేజ్ సినిమాలు సైతం హిట్ అవుతుంటాయి. మెగా హీరోల్లో ప్రచారం విషయంలో మొహమాటం చాలా ఎక్కువ. వరుణ్ తేజ్‌కి అయితే మరీనూ. మీడియాతో పెద్దగా కలవడు. సినిమాల గురించి గొప్పలు చెప్పడు. సినిమా బాగున్నా, లేకపోయినా ఒకే రియాక్షన్. సినిమానే మాట్లాడాలి, మనం ఎంత మాట్లాడినా ఉపయోగం లేదన్న ఫిలాసఫీ తనది కావొచ్చు.
అయితే.. ఈ జనరేషన్లో అలా కుదరదు. చివరి నిమిషం వరకూ పబ్లిసిటీ చేస్తూనే ఉండాలి. వరుణ్‌తేజ్ ఈ విషయాన్ని ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నాడు. ‘ఆపరేషన్ వాలెంటైన్’ విషయంలో తనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. మార్చి 1న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. నెల రోజుల ముందే.. వరుణ్ ప్రచార కార్యక్రమాల్ని మొదలెట్టేశాడు. పాన్ ఇండియా సినిమా కాబట్టి, దేశమంతా తిరుగుతున్నాడు. పుల్వామా లాంటి సెన్సిటీవ్ ప్రదేశాలకూ వెళ్లొచ్చాడు. వచ్చే వారం నుంచి ఏపీ, తెలంగాణలలో ప్రమోషన్ కార్యక్రమాల్ని మరింత ముమ్మరం చేయనున్నాడు. పాన్ ఇండియా సినిమాలకు ఈమాత్రం ప్రచారం ఉండాల్సిందే. అందుకే వరుణ్ దేశమంతా చక్కర్లు కొడుతున్నాడు. ఈ ప్రమోషన్ స్ట్రాటజీ సినిమా ఓపెనింగ్స్‌కి బాగా ఉపయోగపడుతుంది కూడా.
దేశభక్తి నిండిన కథ ఇది. ఇప్పటికే టీజర్ బయటకు వచ్చింది. అందులో ఎయిర్‌ఫోర్స్ చేసే యాక్షన్ విన్యాసాలు కనిపించాయి. ఇప్పుడు ట్రైలర్ సిద్ధం చేస్తున్నారు. ఈసారి ఎమోషన్ టచ్ ఇవ్వడానికి చిత్రబృందం కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే ట్రైలర్ కట్ పూర్తయ్యింది. మిక్కీజేమేయర్ ఈ ట్రైలర్‌కు నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు. అది అవ్వగానే ట్రైలర్ విడుదల చేస్తారు.