‘పరుచూరి పలుకులు’ శీర్షికతో సినిమా పాఠాలు, మంచి, చెడ్డలు చెబుతుంటారు సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. ఆయన విశ్లేషణలు బావుంటాయి. ఏదైనా ఒక సినిమాని సమీక్షించే క్రమంలో చాలా పద్దతిగా, అవతలి వారి మనసు నొచ్చుకోకుండా, అట్టర్ ఫ్లాఫ్ సినిమాల్లో కూడా ఎంతోకొంత సారాన్ని వెదికి ప్రేక్షకులు చెప్పడం ఆయన స్టయిల్. అయితే తాజాగా మహేష్ బాబు ‘గుంటూరు కారం’పై ఆయన చేసిన విశ్లేషణ కుండబద్దలు కొట్టినట్లుగా వుంది. ఆ వీడియోలోని ఆయన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ”మందులో వున్నాడు కాబట్టి కొట్టిపంపించేశాడు. లేకపోతే.. ” అంటూ కాయిన్ చేసిన సినిమాలోని డైలాగ్ పై ఆయన చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్ మీమ్ స్టప్ అయిపొయింది. ఈ వీడియో చూసిన జనాలు ‘ఇదెక్కడి మాస్ ర్యాగింగ్ మావా’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక ఈ సినిమా కథపై పరుచూరి ఎత్తిచూపిన లోపాలు కూడా కుండబద్దలు కొట్టినట్లుగా వున్నాయి. ”తల్లికొడుకుల సెంటిమెంట్ పండలేదు. తాత మనవళ్ళ ట్రాక్ లో బలం లేదు. పాత్రల్లో అనవసరమైన డ్రామాలు ఎక్కువైపోయాయి. ఒక సంతకం కోసం చేసిన డ్రామాలన్నీ తేలిపోయాయి. అసలు ఇంత చిన్న కథ మహేష్ బాబు ఇమేజ్ కి సరిపొతుందని త్రివిక్రమ్ ఎలా భావించారు?” అంటూ సూటిగా ప్రశ్నించారు పరుచూరి.
తల్లికొడుకుల కథ చెప్పాలనుకున్నప్పుడు గుంటూరబ్బాయి లాంటి టైటిల్ పెడితే నప్పేది ఏమో కానీ అసలు గుంటూరు కారం అనే పేరే దీనికి పని చేయలేదని అభిప్రాయపడ్డారాయన. జనాలు అందరూ ఫీలైనట్లే.. పరుచూరి కూడా ”ఇది తివిక్రమ్ సినిమాలా అనిపించలేదు. మహేష్ బాబు చేయదగ్గ కథ కాదు’ అని నిర్మోహమాటంగా తేల్చేశారు.
”మహేష్ బాబు త్రివిక్రమ్ ఇమేజ్ తో ఈ సినిమాకి డబ్బు రావచ్చు. కానీ సినిమా చూసినప్పుడు ఒక తృప్తి కలగాలి. అందరూ ఫ్లాపులు రాస్తారు. అయితే చాలా వరకు అవి తెలియకరాసినవి. తెలిసిన రాసిన ఫ్లాపులు మాత్రం ఎవరో ఒకరి మొండి పట్టుదల వలన జరిగేవే. గుంటూరు కారం చూసినప్పుడు ఇదే ఫీలింగ్ కలిగింది. త్రివిక్రమ్ అంటే చాలా ఇష్టం గౌరవం. తివిక్రమ్ అంటే ఏమిటో మరోసారి చూపించే అద్భుతమైన కథతో రావాలి” అని ముక్తాయించారు పరుచూరి.